హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : రైతులందరికీ ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని దేవుళ్లందరి మీద ఒట్టు వేసి మరీ చెప్పారు. తెలంగాణలో ఒట్టంటే నమ్మకం. ‘రశీదు తప్పితే మసీదే గతి’ అని తెలంగాణలో నానుడి. మాట విషయంలో తేడా వస్తే చివరికి దేవుడిపై ఒట్టేయడమే గ్రామీణ ప్రాంతాల్లో పరిపాటి. పచ్చబియ్యం పట్టుకొని ప్రమాణం చేస్తే, దాన్ని సత్యంగానే పరిగణిస్తారు. అటువంటిది దేవుళ్ల మీదే ఒట్టేసి మాట తప్పడమంటే.. చాలా పెద్ద పాపమే. గతంలో యాదగిరిగుట్టలో తడిబట్టలతో తప్పుడు ప్రమాణం చేసిన నాయకుడు త్వరలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని కోల్పోయిన సంగతి అందరికీ గుర్తే. ఈ నేపథ్యంలో మాట తప్పిన రేవంత్‌రెడ్డి చేసిన పాపం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శాపం కాకుండా ఉండాలని ఆయా ఆలయాలను దర్శించి పూజలు చేసేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు ఆలయయాత్ర చేపట్టారు. అందులో భాగంగా తొలుత యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని గురువారం దర్శించుకున్నారు. ఆ సందర్భంగా అక్కడ అందరితో కలిసి హరీశ్‌రావు చేసిన సంకల్పం.
కర్షకాణాం రుణబాధా నివృత్తి విషయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్‌రెడ్డి కృత అసత్య ప్రలాప పాప పరిహారార్థం విశేషేన రుణ విముక్తి విషయే తస్యకృత వాగ్దానభంగ ప్రాయశ్చిత్తార్థం తస్య కృత దైవ ప్రమాణభంగ తీవ్ర పాప పరిహారార్థం సమస్త తెలంగాణ రాష్ట్ర స్థిత అమాత్యానాం, ముఖ్యమంత్రీనాం సత్యానాం సర్వేషాం ప్రజానాం విషయే సద్బుద్ధి ప్రసాద సిద్ధ్యర్థం విశేషేన కర్షకాణాం రుణవిముక్తి పర్యంతం త్వయమేవ సంకల్పిత యుద్ధాయ శక్తి హేతవే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఏతస్మిన్ ముఖ్యమంత్రి కృత అసత్య ప్రలాప ప్రజానాం బాధా నివారణార్థం అస్మిన్ సంకల్పిత ప్రథమ దేవాలయే శ్రీలక్ష్మీనరసింహస్వామి ఫల సిద్ధ్యర్థం పుణ్య దర్శనంచ అర్చనంచ అహం కరిష్యే ప్రజానాం త్వయమేవ కరిష్యామః
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ నేతలపై యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. హరీశ్‌రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్ఎస్ నేతలు మాఢవీధుల్లో సంకల్పం చేయడంపై అభ్యంతరం తెలుపుతూ ఈవో భాస్కర్‌రావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నటు సీఐ రమేశ్ తెలిపారు.
యాదగరిగుట్ట, ఆగస్టు 22: హరీశ్‌రావుపై కేసు నమోదు చేసినట్టుగానే ఆలయ నిబంధనలకు విరుద్ధంగా రాజకీయపరమైన శుద్ధి కార్యక్రమం చేపట్టిన విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతోపాటు మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల నాయకులు కానుగు బాలరాజుగౌడ్, బందారపు భిక్షపతి తదితరులపై కూడా కేసు నమోదు చేయాలని నల్లగొండ డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.