బొగ్గు సామ్‌పై సమాధానం చెప్పే దమ్ములేకనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోటీసుల పేరుతో డైవర్షన్ డ్రామాలాడుతున్నారు. రాజకీయ కక్షతోనే మొన్న నాకు, ఇప్పుడు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. రేవంత్‌రెడ్డీ.. గుర్తుపెట్టుకో! ప్రతీకారం అనేది బలహీనుల ఆయుధం, దమ్మున్న నాయకుడి ఆయుధం ఎప్పుడూ ప్రజాపోరాటమే. నోటీసులకు సమాధానం చెప్పేందుకు బీఆర్ఎస్ నాయకులం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటం. రేపు ప్రజాకోర్టులో సమాధానం చెప్పేందుకు మీరు కూడా సిద్ధంగా ఉండాలి.
– హరీశ్‌రావు
మెదక్, జనవరి 22(నమస్తే తెలంగాణ)/హైదరాబాద్: కాంగ్రెస్ వైఫల్యాలు, స్కామ్‌లు, ఆరు గ్యారెంటీలు, హామీలపై ప్రశ్నిస్తున్నందుకే తనతో పాటు కేటీఆర్‌ను ప్రభుత్వం టార్గెట్ చేసి విచారణల పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. గురువారం మెదక్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ సావిత్రీ సురేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరగా హరీశ్‌రావు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. బొగ్గు స్కామ్‌పై సమాధానం చెప్పే దమ్ములేకనే సీఎం రేవంత్‌రెడ్డి నోటీసుల డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.
పాలనలో వైఫల్యం, కాంగ్రెస్ వరుస స్కామ్‌ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సిటీ నోటీసుల పేరిట రేవంత్ సర్కార్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి బావమరిది బొగ్గు స్కామ్‌పై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను డైవర్ట్ చేసేందుకే నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను విచారణ పేరుతో వేధించే ప్రయత్నం చేసినా ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టమని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుంభకోణాలు, వాటాల పంచాయితీలను బట్టబయలు చేస్తామని స్పష్టంచేశారు.
కేసీఆర్ హయాంలో మెదక్ జిల్లా ఏర్పాటు
కాంగ్రెస్ పార్టీ 40 ఏండ్లు పాలించినా మెదక్‌ను జిల్లాకేంద్రం చేయలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసీఆర్ మెదక్‌కు మెడికల్ కళాశాల, రైలు, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటుచేశారని హరీశ్‌రావు తెలిపారు. బీఆర్ఎస్ హ యాంలో పదేండ్లు రైతులు పంటలు సాగు చేసుకోవడానికి ఘనపూర్ ఆనకట్ట నుంచి పుష్కలంగా నీళ్లు విడుదల చేశామని, ఘనపూర్ ప్రాజెక్టుకు సింగూర్ నీళ్లు విడుదల చేయకపోతే ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మైనారిటీలకు బడ్జెట్లో రూ.4 వేల కోట్లు పెడుతామని కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఇమామ్, మౌజంలకు రూపాయి ఇవ్వలేదని, కేసీఆర్ రైతులకు వరినాట్ల కోసం రైతుబంధు ఇస్తే, సీఎం రేవంత్ కేవలం ఎన్నికలు ఉంటే నే రైతుభరోసా ఇస్తున్నారని విమర్శించారు.
రేవంత్.. నువ్వు సీఎంవా..? సైబర్ నేరగాడివా?
ట్రాఫిక్ చలాన్ల పేరుతో ప్రజల బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు కట్ చేయాలని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, రేవంత్ ముఖ్యమంత్రివా? లేక సైబర్ నేరగానివా? అని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తే, రేవంత్‌రెడ్డి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవ్వాతాతలకు రూ.50వేల పెన్షన్ బకాయి పడిందని, ఆడబిడ్డలకు మహాలక్ష్మీ పథకంలో రూ.62,500 బాకీ పడిందని, చీరలు పంచుతుంటే మహాలక్ష్మీ పైసలు ఎప్పుడు ఇస్తారని మంత్రి దామోదర రాజనర్సింహను అందోల్‌లో మహిళలు నిలదీశారని గుర్తుచేశారు.
రోడ్ల దుస్థితి, వీధి దీపాలు లేవని చెన్నూరులో మంత్రి వివేక్‌పై, మహాలక్ష్మి డబ్బులు ఎప్పుడు ఇస్తారని మధిరలో ఉప ముఖ్యమంత్రి భట్టిపై, హైదరాబాద్‌లో తిరుగుతున్న పొన్నం ప్రభాకర్పైకి ప్రజలు తిరగబడ్డారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కష్ట్టపడి పని చేయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరాగాంధీ హయాం నుంచి మెదక్
జిల్లాను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నాయకులు ఊరించి ప్రజలను మోసం చేశారు. కానీ, కేసీఆర్ మాట ఇచ్చి మెదక్ జిల్లాకేంద్రం ఏర్పాటు చేసి హామీ నిలబెట్టుకున్నారు. మెదక్ జిల్లాను రద్దు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే మెదక్ జిల్లాను
రద్దు చేసుకోవడమే.
– హరీశ్‌రావు