హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ సిటీలా మారుస్తానని, ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ఫ్యూచర్‌సిటీ నుంచి బెంగళూరు, అమరావతి, చెన్నైకి బుల్లెట్ ట్రైన్‌ను కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్లో గురువారం ఫ్యూచర్‌సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడారు. తాను ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించాలనుకుంటే కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, తనకు ఇక్కడ భూములున్నాయని అందుకే నగరం నిర్మిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారని చెప్పారు. తనకు పదేండ్ల సమయమిస్తే దీనిని న్యూయార్క్‌లో ఉన్నవాళ్లు కూడా భారత్ ఫ్యూచర్‌సిటీని చూసొచ్చాం అని చెప్పుకొనేలా తీర్చిదిద్దుతానని తెలిపారు.
ఫ్యూచర్ సిటీ మరో న్యూయార్క్, సింగపూర్, దుబాయ్, జపాన్ నగరాలనే మరిపిస్తుందని చెప్పారు. ఇక్కడికి ప్రపంచంలోని 500 కంపెనీలను రప్పిస్తానని స్పష్టంచేశారు. నెలకు మూడుసార్లు ఇక్కడికి తానొస్తానని, ఇక్కడే కూర్చొని కంపెనీలను రప్పిస్తానని చెప్పారు. ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సహకరించాలని స్థానిక నేతలు, రైతులను ఆయన కోరారు. సమస్యలపై కోర్టుల చుట్టూ తిప్పొద్దని, ఏవైనా సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకుందామని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మీ తాతలు, ముత్తాతల భూములను అప్పనంగా తీసుకోబోనని, తనకు కూడా వ్యవసాయం ఉన్నదని, భూమితో వ్యాపారం ఉన్నదని, భూమి విలువ తనకు తెలుసని చెప్పారు. ఫ్యూచర్ సిటీకి అందరూ సహ కరిస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు.
వ్యాపార విస్తరణలో భాగంగా ఇతర రాష్ర్టాలు, ఖండాంతరాలకు విస్తరిస్తున్న సింగరేణి సంస్థ అంతర్జాతీయ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు ఫ్యూచర్ సిటీలో సింగరేణి గ్లోబల్ ఆఫీస్ కోసం సుమారు 10 ఎకరాల స్థలాన్ని కేటాస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రాబోయే డిసెంబర్‌లోపు అంతర్జాతీయ కార్యాలయ నిర్మాణాలను పూర్తిచేసి, ప్రారంభించాలని ఆదేశించారు.