హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): టీ-ఫైబర్‌కు రూ.1,779 కోట్ల మేర వడ్డీలేని దీర్ఘకాలిక రుణం ఇవ్వాలని కేంద్ర టెలికం, కమ్యూనికేషన్లశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3గా మార్చేందుకు సమర్పించిన డీపీఆర్‌ను ఆమోదించాలని విజ్ఞప్తిచేశారు. ఢిల్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం కేంద్రమంత్రులను వేర్వేరుగా భేటీ అయ్యారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల గృహాలు, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల గృహాలకు నెలకు రూ.300కే ఫైబర్ కనెక్షన్ కల్పించాలని లక్ష్యంగా పెట్టకున్నట్టు కేంద్ర మంత్రి సింధియాకు తెలిపారు. టీ-ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా కనెక్టివిటీని కల్పించడం తమ ఉద్దేశమని వివరించారు. రాష్ట్రంలో 300 రైతు వేదికలకు టీ-ఫైబర్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, సాంఘిక సంక్షేమ పాఠశాలలకూ టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్ (ఎన్‌వోఎఫ్‌ఎన్) తొలిదశను భారత్‌నెట్-3 ఆరిటెక్చర్కు మార్చడానికి గత అక్టోబరులో కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ను పంపించామని, దానిని త్వరగా ఆమోదించాలని కోరారు.
జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు తెలంగాణలో ఉన్నాయని, వచ్చే ఏడాది జనవరిలో జరుగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను నిర్వహించే అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈత కొలనులు, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాలు, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్స్, ఫుట్‌బాల్ గ్రౌండ్స్, సేటింగ్ ట్రాక్స్, వాటర్‌స్పోర్ట్స్, ఇతర క్రీడలకు వసతులు ఉన్నాయని వివరించారు. భవిష్యత్తులో ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ వంటి అంతర్జాతీయ క్రీడలను తెలంగాణలో నిర్వహించే అవకాశం ఇప్పించాలని విజ్ఞప్తిచేశారు. జీఎంసీ బాలయోగి స్టేడియం, షూటింగ్ రేంజ్, ఎల్బీ స్టేడియం, హకీంపేటలోని స్పోర్ట్స్ సూల్, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం అప్‌గ్రెడేషన్‌కు సమర్పించిన డీపీఆర్‌లను ఆమోదించాలని కేంద్రమంత్రిని కోరారు.