Bharat Summit | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్-2025లో గందరగోళంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, పలు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో మొదటిరోజు సర్వత్రా సమన్వయలోపం కనిపించిందని సమ్మిట్‌కు హాజరైన ప్రతినిధులు మండిపడ్డారు. ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం నుంచే ప్రతినిధులు చర్చలో పాల్గొనకపోవడంపై జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు ఆశ్చర్యంవ్యక్తంచేశారు. కార్యక్రమ నిర్వహణలో సమర్థవంతమైన ప్రణాళిక లేదని తెలిపారు.
భారత్ సమ్మిట్-2025కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని నిర్వాహకులు ప్రకటించారు. కానీ తొలిరోజు వారెవరూ హాజరు కాకపోవడంతో ప్రతినిధులు నిరుత్సాహం వ్యక్తంచేశారు. కనీసం రెండోరోజైనా వారు హాజరవుతారా? లేదా అనే విషయంపై ఎవరూ స్పష్టత ఇవ్వడంలేదని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకమైన సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని విమర్శిస్తున్నారు. సదస్సుకు సీఎం రేవంత్‌రెడ్డి కూడా డుమ్మా కొట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. సదస్సు ద్వారా తెలంగాణకు పెట్టుబడులు రాబట్టేందుకు అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ పట్టించుకోవడంలేదని, అలాంటప్పుడు ఇంతఖర్చు పెట్టి సదస్సు నిర్వహించడమెందుకని సదస్సులో సొంతపార్టీ ప్రతినిధులే పెదవి విరిచారు. సమ్మిట్‌కు వచ్చిన మంత్రులు, నేతల మధ్య సమన్వయం కనిపించలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు.
ప్యానల్ డిసషన్లలో తెలంగాణ నుంచి ఒక ప్రతినిధికి కూడా అవకాశం దకలేదు. తమకు ఆసక్తి ఉందని కొందరు చెప్పినా నిర్వాహకులు పట్టించుకోలేదని తెలంగాణ ప్రతినిధులు తెలిపారు. అంతర్జాతీయ వేదికల మీద మాట్లాండేంత నాలెడ్జ్ ఎవరికి ఉంది? ఎవరికి అవకాశం ఇద్దాం? అంటూ ఆరా తీసిన నిర్వాహకులు గురువారం రాత్రి కొందరు ఎంపీలను ఎంపిక చేశారని, వారికి మరుసటి రోజు మాట్లాడాల్సిన టాపిక్ గురించి చెప్పారని తెలుస్తున్నది. అయితే అర్ధరాత్రి సమాచారమిచ్చి, మరుసటి రోజు మాట్లాడాలని చెప్తే ఎలా అంటూ కొందరు ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు.