దేవరుప్పుల, నవంబర్ 11: దళితబంధు పథ కం పారదర్శకంగా అమలవుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్లలో శుక్రవారం నిర్వహించిన దళితబంధు అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఈ పథకంతో దళితులు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధుల జోక్యం ఉండదన్నారు. దళితులే కమిటీగా ఏర్పడి సమన్వయంతో ఎంపిక చేసుకోవాలని సూచించారు. త్వరలో సీఎం కేసీఆర్ మహబూబాబాద్‌కు రానున్నారని, నూతన కలెక్టరేట్, వైద్య కళాశాల భవనాల సముదాయాలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు.