ఉద్యోగులకు వేతనాల విషయంలో ఏ రాష్ట్రమూ తెలంగాణ దరిదాపుల్లో కూడా లేదు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కంటే తెలంగాణలో అంగన్వాడీలకు వేతనాలు రెండు రెట్లు అధికంగా ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వేతనాలు ఎందకు పెంచటం లేదని ఆ పార్టీ నేతలను అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు నిలదీయాలి. దేశంలో ఆశా వర్కర్లకు అందరికంటే ఎక్కువ జీతాలిస్తున్నది సీఎం కేసీఆర్ మాత్రమే.
వికారాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు త్వరలో శుభవార్త చెప్పబోతున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అతి త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. హరీశ్‌రావు బుధవారం మెదక్, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధి తూప్రాన్, మనోహరాబాద్‌లో పర్యటించారు. తాండూరు నియోజకవర్గంలో రూ.50 కోట్ల తో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ చోట్ల మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు అంగన్వాడీలు, ఆశ వర్కర్ల వేతనాలు కూడా పెంచుతామని ప్రకటించారు.
గవర్నర్‌ను గడ్డం పెట్టుకొని బీజేపీ గలీజు రాజకీయం చేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు 8 కేంద్రీయ విద్యాలయాలు ఇచ్చిన మోదీ సర్కారు, తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఒక్క కేంద్రీయ విద్యాలయం ఇవ్వని ప్రధాని మోదీ, ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. దేశంతోపాటు తెలంగాణ వెనుకబాటు నేరంలో ఏ1 కాంగ్రెస్ అయితే ఏ-2 బీజేపీ అని విమర్శించారు. కాంగ్రెస్ 60 ఏండ్ల పాలనకంటే, బీజేపీ 15 ఏండ్ల పాలనకంటే నేడు తెలంగాణలో బీఆర్ఎస్ పాలన అద్భుతంగా ఉన్నదని మేధావుల నుంచి సామాన్యుల వరకు చెప్తున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాల రైతులంతా నేడు తెలంగాణ తరహా పాలన కోరుతున్నారని చెప్పారు. ఉద్యోగులకు వేతనాల విషయంలో ఏ రాష్ట్రమూ తెలంగాణ దరిదాపుల్లో కూడా లేదని అన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌కంటే తెలంగాణలో అంగన్వాడీలకు వేతనాలు రెండు రెట్లు అధికమని గుర్తుచేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వేతనాలు ఎందకు పెంచడం లేదంటూ ఆ పార్టీ నేతలను అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు నిలదీయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఆశా వర్కర్లకు అందరికంటే ఎక్కువ జీతాలిస్తున్నది సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. తెలంగాణలో ఆశాలకు రూ.9,900ల జీతం ఇస్తుండగా, కాంగ్రెస్ పాలనలోని కర్ణాటకలో రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. సీపీఐ మాటలు విని అంగన్వాడీలు మోసపోవద్దని సూచించారు. కర్ణాటకలో అంగన్వాడీలకు రూ.10 వేల జీతం ఇస్తుండగా, తెలంగాణలో రూ.13,650 ఇస్తున్నామని గుర్తుచేశారు. ‘రాష్ట్రంలో బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు. ఎవరు ఔనన్నా, కాదన్నా హ్యాట్రిక్ సీఎం కేసీఆరే. కేసీఆర్ మనసును ప్రేమతో గెలవాలి. కానీ సీపీఎం, సీపీఐవాళ్లు రెచ్చగొట్టినట్టు చేస్తే అనవసరంగా నష్టం జరుగుతుంది’ అని హరీశ్‌రావు అన్నారు.
కాంగ్రెస్ హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటే, నేడు పోదాం పదా బిడ్డో సర్కారు దవాఖానకు అన్నంత గొప్పగా ప్రభుత్వ దవాఖానలను బాగు చేసుకొన్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గతంలో ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతం ప్రసవాలు జరగ్గా, నేడు 70 శాతానికి చేరాయని చెప్పారు. పేదింటి అడబిడ్డల పెళ్లిళ్లకు, కాన్పులకు కూడా సీఎం కేసీఆర్ సహాయం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఏనాడైనా ఒక్క రూపాయి సహాయం చేశారా అని ప్రశ్నించారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడంలేదా? అని కాంగ్రెస్ నేతలను మం త్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. అభివృద్ధికి గజ్వే ల్ నియోజకవర్గమే ఉదాహరణగా పేర్కొన్నా రు. కాంగ్రెస్ నేతలకు ప్రెస్మీట్లు పెట్టడం తప్ప ఏమీ చేతకాదని ఎద్దేవా చేశారు. గజ్వేల్, తూప్రాన్ అభివృద్ధి చెందలేదని కాంగ్రెస్ నేత మహ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడటం విడ్డూర మని అన్నారు. ‘కావాలంటే మా వెంట రండి అభివృద్ధిని చూపిస్తాం’ అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలు నోరు జారకుండా ఉంటే మంచిదని సూచించారు. రాబో యే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. కార్యక్రమా ల్లో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, మెతు కు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.