హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న కలెక్టరేట్లలో ఇక సోలార్ విద్యుత్తు వెలుగులు పంచనుంది. గ్రిడ్ వినియోగాన్ని తగ్గించి సోలార్ విద్యుత్తును వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. తద్వారా ప్రభుత్వానికి ఏటా లక్షలాది రూపాయలు ఆదా కానుంది. ఖమ్మం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టర్ కాంప్లెక్స్)లో 200 కిలోవాట్ల గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్తు ప్లాంట్‌ను రెడో సంస్థ ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి గురువారం తెలిపారు. కలెక్టరేట్లో ప్రస్తుతం ప్రతినెలా దాదాపు 28 వేల యూనిట్ల విద్యుత్తు వినియోగిస్తున్నారు. ఇప్పుడు 200 కిలోవాట్ల సోలార్ గ్రిడ్ ఏర్పాటుతో నెలకు దాదాపు 24 వేల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.
నెలకు ఇప్పుడు రూ.1.80లక్షలకుపైగా వస్తున్న బిల్లు సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో ఇది 80 శాతం తగ్గుతుంది. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ఇప్పటికే 100 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు సతీశ్‌రెడ్డి తెలిపారు. కలెక్టరేట్, సోలార్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ 20న ప్రారంభించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఏటా 1.44 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని, తద్వారా ఏడాదికి రూ. 11,23,200 ఆదా అవుతాయని వివరించారు. రంగారెడ్డి, కామారెడ్డి కలెక్టరేట్లలో 100 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర పునరుత్పాదకశక్తి అభివృద్ధి సంస్థ 20 ఏండ్లపాటు చూసుకుంటుందని తెలిపారు.