4 ఎకరాలుంటే నేడు కోటీశ్వరుడు
రాష్ట్రంలో టీఆర్ఎస్కు దీటైన ప్రతిపక్షమే లేదు
మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబు
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడిన ఏడేండ్లలోనే దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే ఎంతో వేగంగా ముందుకు దూసుకు పోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సీఎం ఇచ్చిన జవాబులు ఆయన మాటల్లోనే..
క్షుద్ర విద్యలు.. క్షుద్ర ఆరోపణలు
తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు నాపై ఎన్ని జోకులొచ్చాయో మీకు తెలుసు. అంతిమంగా తెలంగాణ సాధ్యమైంది. ఇండియాకే పోటీగా 60 ఏండ్ల కన్నా ముందు ఉన్న రాష్ర్టాల కన్నా తెలంగాణ ముందుకు పోయింది. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, తాగునీరు, ఉపాధి కల్పన.. ఇలా అన్నింటిలో ముందు వరుసలో ఉన్నది. ఒకప్పుడు వలసలు పోయిన తెలంగాణకు ఇప్పుడు 11 రాష్ర్టాల నుంచి వలసలు వచ్చింది నిజం కాదా? కరోనా వేళ.. వలస కూలీలకు 172 రైళ్లు పెట్టి, వారి సొంత రాష్ర్టాలకు పంపించినం. తెలంగాణలో పుడుతున్న పనికి, సంపదకు ఇక్కడి కూలీలు సరిపోవడం లేదు. ఆంధ్రా, రాయచూర్, మహారాష్ట్ర, బెంగాల్ నుంచి కూలీలు వస్తున్నరు. మీకు ఉజ్వలమైన తెలంగాణ కనిపిస్తలేదా? అబద్ధాలు నమ్ముదమా.. కండ్లముందు కనపడే తెలంగాణను నమ్ముదమా.. అభూత కల్పనలు, పిచ్చి మాటలు నమ్ముదామా? నిజంగా కండ్ల ముందు కనపడే తెలంగాణను నమ్ముదామా? ఏం చేసింది మోదీ ప్రభుత్వం ఇన్నేళ్లల్లో? ఏ వర్గానికైనా మేలు జరిగిందా? పరిశ్రమలు మూతపడ్డయ్. జీడీపీ తగ్గిపోయింది. ఆకలి రాజ్యం పెరుగుతున్నది. చర్చకు కూర్చుందమా? క్షుద్ర విద్యలు, క్షుద్ర ఆరోపణలకు మించి ఏమన్న ఉన్నదా? వాళ్లకు ఏమైనా సిగ్గు, శరం ఉన్నదా? రామానుజుల విగ్రహం మోదీ కట్టించినారా!
ఇంతకన్న లత్కోర్ దందా ఉంటదా? తెలంగాణలో మార్పులకు కారణం?
రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే పవర్ ప్లాంటును, 7 మండలాలను ప్రధాని మోదీ లాక్కున్నరు. అయినప్పటికీ ఎక్కడా ఘర్షణ పడలె. ఎందుకంటే ప్రజలు బాధ్యత ఇచ్చిన్రు. ఏడేండ్ల కింద తెలంగాణ ఎట్లుండే. ఇప్పుడు ఎట్లున్నది? కుక్కగాడు, నక్కగాడు మాట్లాడతడా కేసీఆర్ గురించి. ఇవాళ నాలుగెకరాల భూమి ఉన్న రైతు కోటీశ్వరుడు. రోడ్డు పక్కన ఉంటే ఎకరం రూ.50- 60 లక్షలు. ఉత్తగనే వచ్చిందా ఆ విలువ? కడుపునిండా సాగునీళ్లు, 24 గంటలు కరెంటు ఉంటే వచ్చింది. అది కేసీఆర్ కంట్రిబ్యూషన్ కాదా? మే నెలలో హల్దివాగు, మంజీరా, నిజాంసాగర్‌లో నీళ్లు ఎవలు పారిచ్చిన్రు? ఈ సోషల్‌మీడియా దొంగలా?. వాసాలమర్రికి పోయినప్పుడు అక్కడి రైతులను భూమి ధర ఎంతున్నదని అడిగిన. రూ.కోటి అన్నరు. ఆశ్చర్యపోయిన. ఢిల్లీ, బొంబాయిలో ఉన్నోళ్లు హైదరాబాద్‌లో కోట్ల రూపాయలు పెట్టి విల్లాలు కొంటున్నరు. అది మనకు గర్వకారణం. దేశంలో అత్యధిక జీతాలు పొందుతున్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే. అత్యధిక వేతనాలు తీసుకుంటున్న ఆశ వర్కర్లు తెలంగాణ వారే. దేశంలో ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం రిస్క్ అలవెన్స్‌ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలో 10 లక్షల పేదింటి ఆడబిడ్డలకు పెండ్లిళ్లు చేసిన మొగోడు ఎవడూ లేడు. అది తెలంగాణ ప్రభుత్వమే చేసింది. ఇటీవల పది లక్షల మార్క్ దాటినం. నాలుగు కిలోల రేషన్ బియ్యం ఆరు కిలోలు చేసినం. ఇంట్ల నలుగురికే కాకుండా అన్ లిమిటెడ్ చేసినం.
సీనియర్ అధికారి రజత్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై ఏమంటారు?
సీనియర్ అధికారి రజత్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలు పూర్తిగా ఆధార రహితం. కొన్ని కుక్కలు మొరుగుతయ్. పూర్తి ఆధారాలుంటేనే అవినీతిపై మాట్లాడాలి. అంతేకానీ సోషల్‌మీడియాలో వచ్చినవి మాట్లాడడం సరికాదు.
రాష్ట్రంలో మీ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్‌లో ఏది అసలైన ప్రతిపక్షంగా గుర్తిస్తున్నారు?
టీఆర్ఎస్కు దీటైన ప్రతిపక్షమే లేదు. ఎవరు ప్రతిపక్షంలో ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తరు. బీజేపీకి 2018లో 107స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కలే. ఇప్పుడేమైంది. సోషల్‌మీడియాలో హంగామా చేయడం తప్ప ఏం లేదు. దేశానికి తెలంగాణనే మార్గదర్శకం. మహారాష్ట్రలోని కొన్ని పంచాయతీలు తమను తెలంగాణలో కలపాలని తీర్మానం చేశాయి. అదేవిధంగా కర్ణాటకలోని రాయచూర్ కూడా తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నది.