CM KCR | హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మరోసారి మహారాష్ట్రలో పర్యటించనున్నారు. వచ్చే నెల 1వ తేదీన మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా వాటేగావ్ తాలూకా కేంద్రంలో తుకారం భావురావ్ సాఠే (అన్నాభావు సాఠే) జయంతి వేడుకల్లో కేసీఆర్ పాల్గొంటారని ఆ రాష్ట్ర బీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఈ సందర్భంగా సాంగ్లి జిల్లా పార్టీ ప్రముఖులతో కూడా ఆయన సమావేశం కానున్నారని వెల్లడించారు. సాంగ్లి జిల్లా కేంద్రానికి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటేగావ్ గ్రామానికి మహారాష్ట్ర రాజకీయ, సాంస్కృతిక చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్నది. మహారాష్ట్ర యుగ కవిగా, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావురావ్ సాఠే వాటేగావ్‌లోనే 1920, ఆగస్టు 1న జన్మించారు.
మొదట కమ్యూనిస్టుగా ఉన్న ఆయన, ఆ తరువాత మహాత్మాజ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో దళిత ఉద్యమంలో చేరారు. బీఆర్ అంబేద్కర్ భావజాలాన్ని మహారాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనేక రచనలు చేశారు. మాతంగ సామాజికవర్గానికి చెందిన అన్నాభావు సాఠే, దళిత జనోద్ధరణ కోసం జీవితాంతం పాటుపడ్డారు. సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. రష్యా రాజధాని మాస్కోలోని మార్గరీటా రుడోమినో ఆల్ రష్యా స్టేట్ అంతర్జాతీయ సాహిత్య గ్రంథాలయం వద్ద లోక్షాహిర్ అన్నభావు సాఠే విగ్రహాన్ని నెలకొల్పారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనల్లో ముందుగా ఛత్రపతి శివాజీ మహారాజ్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే చిత్రపటాలతోపాటు భావురావ్ సాఠే చిత్రపటానికి సైతం పూలమాలవేసి నివాళులు అర్పించటం ఆనవాయితీగా కొనసాగుతున్నది.
వాటేగావ్ పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దేశంలోని 108 శక్తి పీఠాల్లో కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం ఒకటి. కొల్హాపూర్‌లో దేవీ అంబాబాయి దర్శనం తరవాత కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.