ఏ మతమైనా తప్పులు చేయాలని చెప్పదు. మత మౌఢ్యమే మానవుడిని ఒక పిచ్చిలోకి, ఒక ట్రాన్స్‌లోకి
తీసుకెళ్తుంది. అమానుషమైన పనులు చేయిస్తుంది. ఏ మతంలోనూ హింసకు తావులేదు. ఏ మత
ప్రవక్త కూడా హింసను బోధించలేదు.కొందరు మధ్యలో వచ్చినోళ్లు మాత్రమే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారు.
– ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): మత మౌఢ్యంతోనే సమాజానికి ముప్పు పొంచి ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, ఏ మత ప్రవక్త కూడా హింసను బోధించడని చెప్పారు. కానీ, కొందరు మధ్యలో వచ్చినోళ్లు మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. హైదరాబాద్ నగర శివారు నార్సింగి వద్ద హరేకృష్ణ మూవ్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న 400 అడుగుల ఎత్తుగల హరేకృష్ణ హెరిటేజ్ టవర్ (ఆలయం) నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. భూమిపూజ అనంతరం నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. హరేకృష్ణ ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 కోట్లు అందజేస్తామని ప్రకటించారు. ఈ నిధులను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మా టల్లోనే.. ‘మనిషి చాలా చిన్నవాడు. అనేక రూపాల్లో, అనేక పద్ధతుల ద్వారా పరమాత్మ మనిషిని దీవిస్తూ ఉంటాడు. భాష, భావం, దేశం, ఖండం వేరు కావచ్చు. కానీ, పరమాత్మను ఆరాధించడం మానవ జీవితం ప్రారం భం నుంచి పరంపరగా కొనసాగుతున్నది. మనిషి తనకు తానుగా ఏదైనా విజయాన్ని పొందితే అది తానే సాధించానని చెప్పుకుంటాడు. ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలతో పం ట దెబ్బతింటేనో.. ఏదైనా అపజయం సంభవిస్తేనో.. దేవుడి దయ తప్పిందని భగవంతుని మీద నింద వేస్తాడు. దుఃఖాలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడిపై వేయడం వల్ల మనిషి బాధ నుంచి కాస్త బయట పడతాడు.
దేవాలయం ఒక కమ్యూనిటీ సెంటర్. మ తం సార్వజనీనం. మతంలో ఎలాంటి తప్పు లేదు. ఉండదు. మత మౌఢ్యమే మనకు ము ప్పు. ఏ మతం కూడా తప్పులు చేయమని చె ప్పదు. మత మౌఢ్యమే మానవున్ని ఒక పిచ్చిలోకి, ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్తుంది. అమానుషమైన పనులు చేయిస్తుంది. ఏ మతంలోనూ హింసకు తావులేదు. ఏ మత ప్రవక్తా హింస ను బోధించలేదు. హిందూ మతంలోనూ చెప్పలేదు. కృష్ణ పరమాత్మ అసలే చెప్పలేదు. దానిని మౌఢ్యానికి జతచేసి కొంతమంది మధ్యలో వచ్చినవాళ్లే చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు.. రాహుల్ సాంకృత్యాయన్ అనే గొప్ప రచయిత ‘వోల్గా నుంచి గంగా తీరం వరకు’ అనే గొప్పరచనతో ఇదే విషయాన్ని చెప్పాడు. వేదాలు, ఉపనిషత్తుల్లోని పరమార్థాన్ని అర్థం చేసుకుని అది పంచిన సందేశాన్ని విశ్వానికి పంచితే అంతకు మించి పరమార్థం లేదు.. కానీ, కొంతమంది వేదాల సారాన్ని వక్రమార్గం పట్టిస్తున్నారు. ఈ విషయాన్నే రాహుల్ సాంకృత్యాయన్ ఉద్ఘాటించారు.
హరేకృష్ణ సమాజం మంచి కార్యక్రమాలు చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వానికి అందిస్తున్న తోడ్పాటు గొప్పది. అక్షయపాత్ర, అన్నపూర్ణ క్యాంటీన్లతో ఎంతోమంది ఆకలి తీరుస్తున్నది. స్కూల్ పిల్లల నుంచి హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల వరకు భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదు కూడా లేదు. ఈ భోజనం కేవలం పేదవాళ్లే తింటారని అనుకుంటే పొరపాటే. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు వచ్చి తిని చాలా చక్కగా ఉన్నదని మెచ్చుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, అక్షయపాత్రకు అభినందనలు చెప్తున్నారు. ఇది హరేకృష్ణ వారి అంకితభావానికి నిదర్శనం. అక్షయపాత్రకు తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు. ఎప్పుడు ఎటువంటి సందర్భం వచ్చి నా.. అది కలరా అయినా, కరోనా అయినా మేం ముందు వరుసలో ఉంటామని హరేకృష్ణ చెప్తుంది. మతం పేరిట చెలరేగే దుష్పరిణామాలను నివారించేందుకు, అది పెట్రేగకుండా హరేకృష్ణ సంస్థ కూడా కృషి చేయాలి. విశ్వశాంతిని కోరుకునే మనం యజ్ఞాలు చేస్తాం. ప్రపంచ సంక్షేమం కోసం యాగాలు చేస్తాం. మతాన్ని హృదయపూర్వకంగా విశ్వసించే వారు మతమౌఢ్యం ఎప్పుడూ కోరుకోలేదు.
సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి, 11.22 గంటలకు కోకాపేటకు చేరుకున్నారు. అక్కడ కేసీఆర్‌కు హరేకృష్ణ సంస్థ ప్రతినిధులు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య స్వాగతం పలికారు. సంప్రదాయ పద్ధతిలో సాగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. వేదికపైన ఏర్పాటుచేసిన భూమిపూజ, శంకుస్థాపనకు సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిషరించారు. అనంతరం హరేకృష్ణ మూమెంట్ సం స్థాపకుడు శ్రీల ప్రభుపాదుల విగ్రహానికి పు ష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అప్పటికే కొనసాగుతున్న లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొని పుష్పవస్త్రాలు సమర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ తన సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో విద్యాశా ఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌కుమార్, ఎమ్మెల్యేలు టీ ప్రకాశ్‌గౌడ్, జైపాల్‌యాదవ్, బీఆర్ఎస్ నాయకులు కార్తిక్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి, టూరిజం సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్, హరేకృష్ణ మూమెంట్ చైర్మన్ మధు పండితదాస, హరేకృష్ణ మూమెంట్ హైదరాబాద్ అ ధ్యక్షుడు సత్యగౌరచంద్రదాస, శ్రీకృష్ణ గోసేవా మండలి కార్యదర్శి సురేశ్‌కుమార్ అగర్వాల్, అరబిందో ఫార్మా లిమిటెడ్ ఎండీ నిత్యానందరెడ్డి, శ్రీకృష్ణ గోసేవా మండలి ట్రస్టీ శ్యామ్సుందర్గుప్తా, శ్రీనిధి ఎడ్యుకేషనల్ గ్రూప్ చైర్మన్ కేటీ మహే తదితరులు పాల్గొన్నారు.
నార్సింగిలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌ను రూ.200 కోట్లతో 6 ఎకరాల స్థలంలో 400 అడుగుల (120 మీటర్లు) ఎత్తున నిర్మించనున్నారు. ఇది హైదరాబాద్ నగరానికి మరో సాంస్కృతిక మైలురాయిగా నిలువనున్నది. శ్రీరాధాకృష్ణ, శ్రీశ్రీనివాస గోవిందుల దేవాలయాలతోపాటు విశాల గోష్పాద క్షేత్రంలో (ఆవులతో పవిత్రం చేసిన భూమి) దీనిని నిర్మిస్తారు. ఇందులో 1,500 మంది భక్తులకు వసతి ఉంటుంది. కాకతీయుల కాలం నాటి నిర్మాణ కౌశలంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మాణాలు చేపట్టనున్నారు. ఒకేసారి 500 మంది కి అన్నదానం చేసేలా వసతి ఏర్పాట్లు ఉం టాయి. లైబ్రరీ, కల్యాణి ఆడిటోరియం, ఓపెన్ ఎయిర్ థియేటర్లు, లెక్చర్హాల్స్, క్యూకాంప్లెక్స్, గెస్ట్రూంలు నిర్మిస్తారు. భగవాన్ కృష్ణుని బోధనల సారం యువతకు అర్థం అయ్యేలా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లేజర్ ప్రదర్శనలు ఏర్పాటుచేస్తారు. హైదరాబాద్‌ను ఆధ్యాత్మిక నగరిగా మార్చడంలో ఇదో కీలక నిర్మాణం కానున్నది.
హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందుతున్నది. జీవన ప్రమాణాలు రోజురోజుకూ మారుతున్నాయి. మారిన కాలానికి అనుగుణంగా అనేక రుగ్మతలను ఎదుర్కొంటున్నాం. ఈ బిజీలైఫ్‌లో మనిషికి కాస్త మానసిక ప్రశాంతత అవసరం. దేవాలయంలో సాగే భక్తి, భజనలు, కీర్తనలు, చాలా సందర్భాల్లో మనిషికి సాంత్వన చేకూర్చే ఔషధాల్లా పని చేస్తాయి. హరేకృష్ణ వారు చేపట్టిన దేవాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 కోట్లు ప్రకటిస్తున్నాను. వీటిని త్వరలోనే విడుదల చే స్తాం. ఈ దేవాలయ నిర్మాణం త్వరగా పూ ర్తి కావాలి. ఆధ్యాత్మికంగా, సామాజికం గా ప్రజలకు సేవలు అందించాలి. శాంతిని, ఆధ్యాత్మికతను పెంచే సంస్థలకు ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుంది. మధుపండిత్ చెప్పినట్టుగా యాదగిరిగుట్ట దేవాలయానికి సర్వత్రా అభినందనలు లభిస్తున్నాయి. వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం దేవాలయాలను కూడా అభివృద్ధి చేస్తున్నాం. దేశానికి, విశ్వానికి శాంతియుత సమాజమే రేపటి భవిష్యత్తు అని భావిస్తున్నాం. మన కు శాంతి, ఆధ్యాత్మిక, ఆహ్లాదకరమైన వా తావరణం, ప్రశాంతమైన జీవనం కావాలంటే అది మందిరాలు, మసీదులు, చర్చి ల ద్వారా సాధ్యం. అకడ సాగే ప్రార్థనల ద్వారా శాంతి నెలకొంటుంది.