హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అంటేనే కుర్చీలాట. ప్రజలు రాష్ట్రంలో అధికారం ఇస్తే పెత్తనం మాత్రం ఢిల్లీ లో ఉంటుంది. సీఎం ఎవరు కావాలో, మంత్రులుగా ఎవరు ఉండాలో, వారికి ఏ శాఖ అప్పగించాలో ఢిల్లీ నుంచే ఆదేశాలు వస్తుంటాయి. అంతేకాదు.. ఢిల్లీ పెద్దలు ఏకంగా సీఎం కుర్చీతో చెడుగుడు ఆడుకుంటారు. తమకు నచ్చిన వ్యక్తిని.. జీ హుజూర్ అనే వ్యక్తినే ఆ సీట్లో కూర్చోబెడతారు. వాళ్లకు ఎప్పుడు ఇష్టం లేకపోయినా వెంటనే పద వి నుంచి తొలిగించి మరో వ్యక్తికి ఆ కుర్చీలో కూర్చోబెడతారు. అందుకే.. కాంగ్రెస్ పార్టీ అంటే నే అనిశ్చిత పాలనకు పెట్టింది పేరు.
ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో సీఎం ఎవరు అంటే ఠక్కున చెప్పే పరిస్థితి ఉండదు. ఐదేండ్లలో ఇద్దరు ముగ్గురు సీఎంలు మారిపోతుంటారు. ఆరు దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 40 ఏండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఐదేండ్లకు ఒకరు చొప్పున ఎనిమిది మంది సీఎంలు ఉండాలి. కానీ 40 ఏండ్ల పాలనలో ఏకంగా 16 మంది సీఎంలు మారారు. అంటే ప్రతి రెండున్నరేండ్లకు ఒక ముఖ్యమంత్రి వచ్చారన్నమాట.
ప్రజలు సంపూర్ణ అధికారం ఇచ్చినా..
ఎన్నికల వేళ ప్రభుత్వాలు ఇచ్చే హామీలను బేరీజు వేసుకొని ప్రజలు తమకు నచ్చిన వ్యక్తికి, పార్టీకి ఓటేస్తారు. కానీ.. కాంగ్రెస్ మాత్రం కోట్లాది ప్రజలకు ద్రోహం చేస్తుంది. ప్రజలు సంపూర్ణ మెజార్టీ అప్పగించినా తరుచూ సీఎంలను మార్చుతుంది. అంటే ప్రజలకు నచ్చిన వ్యక్తి కాకుండా, ఢిల్లీ పెద్దలకు నచ్చిన వ్యక్తికే కిరీటం పెడతారన్నమాట. ఉమ్మడి ఏపీలో 1978 ఎన్నికల తర్వాత ఏకంగా నలుగురు సీఎంలు మారా రు. ఐదేండ్లలోనే మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి, కోట్ల విజ య భాస్కర్‌రెడ్డి సీఎంలుగా అలా వచ్చి ఇలా వెళ్లారు. అత్యంత దారుణంగా కోట్ల విజయభాస్కర్‌రెడ్డిని 111 రోజులకే మార్చేశారు. కాంగ్రెస్ పాలించిన ఇతర రాష్ర్టాల్లోనూ ఇదే పరిస్థితి.
వర్గ పోరు, కుట్రలు, కుతంత్రాలు
కాంగ్రెస్‌లో ఎప్పుడూ కనీసం పది మంది సీఎంలు ఉంటారని ఒక నానుడి. ఏ రాష్ట్రం చూసినా నేతలు రెండుమూడు వర్గాలుగా చీలిపో యి.. రోజూ కొట్లాడుకుంటూ ఉంటారు. అంద రూ సీఎం పదవిపైనే ఆశ పెట్టుకొని.. పక్క నేతను పడగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. తెరచాటు కుట్రలకు కాంగ్రెస్‌లో కొదవే ఉండదు. దీంతో ఎప్పుడు ఎవరి పదవి ఊడుతుందో తెలియదు. ఇలా కుర్చీ కోసం కొట్లాటలు, కుట్రలు, పదవుల మార్పులకే ఐదేండ్ల కాలం గడిచిపోతుంది. చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రజలకు చేసిందేమీ ఉండదు. కుంటుపడిన అభివృద్ధి, పడకేసిన ప్రాజెక్టులు, విచ్చలవిడి అవినీతి, ప్రజల అరిగోస తప్ప మరేమీ కనిపించదు.
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్. కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య మొదటి నుంచీ పోరు జరుగుతున్నది. అధిష్ఠానం సిద్ధరామయ్యకు పదవి ఇచ్చినప్పటి నుంచి ఎలాగైనా దింపాలని డీకే శివకుమార్ ఎత్తులు వేస్తున్నారు. రాజస్థాన్ లో సీఎం కుర్చీ కోసం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలె ట్ మధ్య ఐదేండ్లుగా యుద్ధం నడుస్తున్నది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్, జ్యోతిరాధిత్య సింధి యా మధ్య వర్గ పోరు నడిచింది. అది ముదిరి చివరికి సింధియా వర్గం ఏకంగా చీలిపోయి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అస్థిర ప్రభుత్వం.. అస్థిర నిర్ణయాలు
స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుందని, పథకాలు సక్రమంగా అమలవుతాయని, నిర్ణయాలు వేగంగా తీసుకొ ని, అంతే వేగంగా అమలు చేస్తారని ప్రపంచవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. అస్థిర ప్రభుత్వాలను అభివృద్ధికి అడ్డంకులుగా అభివర్ణిస్తుంటారు. కాంగ్రెస్ పదేపదే సీఎంలను మార్చ డం వల్ల పాలనపై తీవ్ర ప్రభావం చూపింది. సీఎంలు మారినప్పుడల్లా వారి ప్రాధాన్యాతలు మారుతుంటాయి. ఒక సీఎం ప్రకటించిన పథకాలను కొత్త సీఎం మార్చివేస్తారు. ఒక సీఎం మొదలు పెట్టిన ప్రాజెక్టును కొత్త వ్యక్తి పక్కన పెట్టేస్తారు. ఏ కార్యక్రమమూ, ఏ పథకమూ ముం దుకు వెళ్లదు. పెట్టుబడులు రావు.
ఉన్న కంపెనీలు వెనక్కి వెళ్లిపోతాయి. అంతిమంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరగవు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి మొదలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, మధుయాష్కీగౌడ్ ఇలా చాలా మందే సీఎం రేసులో ఉన్నారు. సీఎం పదవి తనను వెతుక్కుంటూ వస్తుందని జానారెడ్డి ప్రకటిస్తే.. ఎప్పటికైనా తాను సీఎం అవుతా అని కోమటిరెడ్డి, జగ్గారెడ్డి అంటున్నారు. ఇక తానే సీఎంనని, 9న ప్రమాణం చేస్తానని రేవంత్‌రెడ్డి చెప్పుకుంటున్నారు. ఢిల్లీ పెద్దలు తననే కరుణిస్తారని భట్టి నమ్మకంగా ఉన్నారు. ఇలా ఎవరికి వారే సీఎంలుగా మారిపోయారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడితే వీళ్లంతా పాలన గాలికి వదిలి ఒకరి వెనుక ఒకరు గోతులు తీసుకోవడానికి, కుట్రలు చేయడానికే సరిపోతారు.
స్థిరమైన ప్రభుత్వంతోనే సక్రమ పాలన
స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటాయని, ప్రజలకు సక్రమమైన పాలన అందుతున్నదని నిపుణుల మాట. పదేండ్లలో రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం నడిచింది. దీంతో రైతుబంధు, దళితబంధు, షీ టీమ్స్, ధరణి వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగారు. ఆరు నెలల్లోనే విద్యుత్తు సమస్యను పరిష్కరించగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి, పంటచేలకు నీళ్లు తేగలిగారు. టీఎస్ఐపాస్ వంటి విప్లవాత్మక విధానాల వల్ల పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఫలితంగా పదేండ్లలోనే తలసరి ఆదాయం, రాష్ట్ర జీఎస్డీపీ రెండున్నర రెట్లు పెరిగింది. అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థాయికి తెలంగాణ ఎదిగింది. స్థిరమైన ప్రభుత్వానికి, అస్థిర పాలనకు మధ్య ఉన్న తేడా ఇదే. అందుకే.. ప్రజలు ఓటు వేసే సమయంలో రాబోయే ఐదేండ్లు సుస్థిర పాలన అందించే పార్టీని ఎన్నుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.