CEC Vikas Raj | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ మీడియా సమావేశం నిర్వహించి.. ఎన్నికల నిర్వహణపై కీలక విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని తెలిపారు. ప్రభుత్వ వెబ్సైట్లలో రాజకీయ నేతల ఫొటోలను తొలగించాలన్నారు.
మహిళలు, యువత కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బెయిలీ బ్యాలెట్ పత్రాలను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ప్రత్యేక ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలతో పాటు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రజలు ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 కార్డులను వినియోగించుకోవచ్చని చెప్పారు. ఇక అభ్యర్థులు తమ అఫిడవిట్లో అన్ని కాలమ్స్‌ను అభ్యర్థులు కచ్చితంగా నింపాలని, లేదంటే తిరస్కరణకు గురయ్యే ఛాన్స్ ఉంటుందన్నారు. ఏవైనా ఫిర్యాదుల కోసం 1950 నంబరులో సంప్రదించాలని సూచించారు.
ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. బ్యాలెట్ పత్రాలపై గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటోలను సైతం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 31 వరకు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. అయితే, ఓటరు జాబితాలో చిరునామా మార్పునకు సంబంధించి దరఖాస్తులను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. నగదు లావాదేవీలు, మద్యం సరఫరాపై పూర్తి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. నగదును తీసుకువెళ్లే సమయంలో పత్రాలు, వివరాలు ఉండాల్సిందేనన్నారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై కసరత్తు జరుగుతుందన్నారు.