హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని 84 గ్రామాల అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన 111 జీవోను రద్దు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ జీవోను ఎత్తి వేయాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులు నాడు 84 గ్రామాల్లో తీర్మానాలు చేశారని, నేడు అదే జీవో రద్దు చేసిన ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. ఈ ప్రాంతంలో పదేండ్లుగా పార్టీలకు అతీతంగా ఈ జీవో రద్దుకు అన్ని పార్టీల నాయకులు ఉద్యమాలు సైతం చేపట్టారని ఎంపీ గుర్తు చేశారు. రాజేంద్రనగర్, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు సీఎం కేసీఆర్‌సహా మంత్రులు వచ్చిప్పుడు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు 111 జీవో రద్దు డిమాండ్‌తో ధర్నాలు చేశారని వెల్లడించారు.
కానీ రాజకీయ లబ్ధి కోసం వారే నేడు అధికార పార్టీపై బురద జల్లేందుకు ఆరోపణలు చేయడం, నిరసన తెలపడం విచిత్రంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 111 జీవోను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ఎంపీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 84 గ్రామాల ప్రజల మూడు దశాబ్దాల కలను సాకారం చేసిన ఘనత కేసీఆర్ అన్నారు. సీఎంకు ట్రిపుల్ థ్యాంక్స్ చెప్పారు. సీఎం కేసీఆర్‌కు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని పేర్కొన్నారు. 1996లో అప్పటి ప్రభుత్వం అనాలోచితంగా, అశాస్త్రీయంగా తీసుకొచ్చిన 111 జీవో కారణంగా 84 గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ హామీతో ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టారని ఆయన తెలిపారు. కేసీఆర్ నిర్ణయానికి ప్రజా ఆమోదం కూడా ఉన్నదని పేర్కొన్నారు.