అర్ధశతాబ్దంపాటు అత్యధిక సర్క్యులేషన్‌తో నడిచిన పత్రిక!
లెక్కలేనన్ని మాస, వారపత్రికలు, వీక్లీలు, సాహిత్య, సినీ, రైతు మ్యాగజైన్లు!
తెలుగురాష్ర్టాల్లో వేలమంది జర్నలిస్టులను తయారు చేసిన అక్షరాల ఫ్యాక్టరీ!
టీవీ రంగంలోకి ప్రవేశించి అన్ని భారతీయ భాషల్లో చానళ్లు!
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు!
అభిరుచికి తగ్గట్టుగా అపురూప తెలుగు సినిమాల నిర్మాణం!
చిట్‌ఫండ్స్ నుంచి హోటళ్ల దాకా వ్యాపార సామ్రాజ్య విస్తరణ!
చాలా ఏండ్లు కింగ్ మేకర్‌గా తెలుగు రాజకీయాలను శాసించిన స్థాయి!
పట్టిందల్లా బంగారం చేసుకోగలిగేంత అనన్యసామాన్యమైన పట్టుదల!
‘పనిలోనే విశ్రాంతి..’ అని నమ్మి కడదాకా శ్రమించిన వ్యక్తిత్వం!
ఒక వ్యక్తి తన జీవితకాలంలోఇన్ని సాధించాడంటే నమ్మగలమా!
ఆ అసాధ్యాల సాధకుడు, అనితర సాధ్యుడు.. రామోజీ!
పద్మవిభూషణ్, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామోజీ మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
Ramoji Rao | హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు (87) అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణంతో రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలు, రాజకీయ, సినీ, వివిధ రంగాల ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. సాధారణ కుటుంబంలో పుట్టి, కోట్లాది మందిని ప్రభావితం చేసిన రామోజీ, పత్రిక సంపాదకుడిగా, ఈనాడు గ్రూప్ సంస్థలు, మార్గదర్శి చిట్‌ఫండ్స్, రామోజీ ఫిలింసిటీ, డాల్ఫిన్ హోటల్స్, ఈటీవీ, భారత్ టుడే, ప్రియా పికిల్స్.. ఇలా అనేకానేక సంస్థలకు అధిపతిగా ఒక్కడే చుక్కానిలా నిలిచారు. మరికొన్ని రోజుల్లో స్వర్ణోత్సవాలకు ‘ఈనాడు’ రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఆయన మరణం రెండు తెలుగు రాష్ర్టాల్లో విషాదం నింపింది. 1936, నవంబర్ 16న కృష్ణాజిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మకు రామోజీరావు జన్మించారు. ఆయన అసలుపేరు రామయ్య కాగా బడిలో ‘నీ పేరేమిటి’ అని అడిగితే ‘రామోజీరావు’అని తనకు తానే పేరు పెట్టుకున్న సృజనశీలిగా ప్రత్యేకతను ఆపాదించుకున్నారు. అక్కడ మొదలైన నూతనత్వాన్ని చివరిదాకా ప్రతి అడుగులో కొనసాగించారు. మొదట యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్‌గా ఢిల్లీలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన రామోజీరావు, అనంతరం వేలాది మందికి ఉద్యోగాలిచ్చే వ్యవస్థగా తనను తాను మలుచుకున్నారు. వ్యక్తిగా మొదలై వ్యవస్థలుగా రూపాంతరం చెందారు. 1967లో ఖమ్మంలో వసుంధర పేరుతో ఫర్టిలైజర్స్ వ్యాపారాన్ని ప్రారంభించి 1969 వరకు కొనసాగించారు. తర్వాత ‘అన్నదాత’ పేరుతో వ్యవసాయ మాసపత్రికను ప్రారంభించారు. అనంతరం మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థను నెలకొల్పారు.
రామోజీరావు చీఫ్ ఎడిటర్‌గా 1974, ఆగస్టు 10న ‘ఈనాడు’ మొదలైంది. ఏ భారతీయ భాషా పత్రిక చేయని సాహసాన్ని ఈనాడు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచే కాకుండా చెన్నై, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ నగరాల నుంచి కూడా ప్రచురణను ప్రారంభించిన తొలి తెలుగుపత్రికగా నిలిచింది. 1974 నుంచి ‘ఈనాడు తరం మొదలైంది’ అనేలా పత్రికారంగ వ్యవస్థను రామోజీ తీర్చిదిద్దారు. వార్తల సేకరణ యంత్రాంగాన్ని పటిష్టం చేశారు. సర్క్యులేషన్ వ్యూహాన్ని సైతం పకడ్బందీగా అమలు చేశారు. 1978లో నవలతో చతుర, వివిధ భాషా కథల సమాహారంగా విపుల మాసపత్రికలు ప్రారంభించారు. 1989 జనవరి నుంచి జిల్లా అనుబంధాల (టాబ్లాయిడ్స్)ను ప్రారంభించారు. 1992 నుంచి మహిళల కోసం వసుంధర పేరుతో ప్రత్యేక పేజీని వెలువరించారు. పాత్రికేయులకు సమగ్ర శిక్షణ ఇస్తున్నా దానికో వ్యవస్థీకృత రూపం కావాలని ఈనాడు జర్నలిజం స్కూల్‌ను ప్రారంభించారు. సారా నిషేధం కోసం ఈనాడు మడమ తిప్పనిపోరాటం చేసింది. మద్యనిషేధం కోసం పాటలు, బ్యానర్లు రూపొందించి ప్రజల్లో చైతన్యం తెచ్చింది. మద్యనిషేధ ఉత్తర్వులు వచ్చే దాకా పోరు సాగించింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని పత్రిక భుజానికెత్తుకున్నది.
1977, నవంబరు 19న కృష్ణా జిల్లా దివిసీమలో పెను తుఫాను విధ్వంసం సృష్టించింది. ఈ విపత్తులో సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఈనాడు ద్వారా రామోజీ అండగా నిలిచారు. ఈనాడు పిలుపుతో పోగైన సహాయనిధి రూ.7.5 లక్షలతో 112 ఇండ్లు కట్టించి పాలకాయతిప్ప గ్రామాన్ని పునర్నిర్మించారు. మిగిలిన సొమ్ముతో కోడూరు సమీపంలోని కృష్ణాపురంలో 22 ఇండ్లు నిర్మించారు. 1996 అక్టోబర్, నవంబర్‌లో దివిసీమలో జలప్రళయం వచ్చింది. రాష్ట్రంలోని అయిదు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. లక్షల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. గ్రామాలకు గ్రామాలే సమూలంగా తుడిచి పెట్టుకుపోయాయి. ఈనాడు సంస్థల తరఫున రూ.25లక్షల విరాళమిస్తూ మానవతావాదులకు పిలుపునిచ్చారు. దీంతో కోటీ అరవై లక్షలు పోగయ్యాయి. తీరగ్రామాల్లో శాశ్వతంగా నిలిచేలా, ఆపద సమయాల్లో స్థానికులకు రక్షణ కల్పించేలా 42 సూర్య భవనాలను ఈనాడు ఆధ్వర్యంలో నిర్మించారు.
స్వతహాగా రామోజీ కళాభిమాని. చిన్నతనంలోనే ఊళ్లో నాటకాలు, సాంసృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకునేవారు. సినిమాలంటే ఇష్టపడే ఆయన, 1978లో నిర్మించిన ‘మార్పు’ చిత్రంలో న్యాయమూర్తి పాత్ర పోషించారు. 1995లో ఈటీవీ తెలుగు చానల్‌ను ప్రారంభించి వెండితెరకు బుల్లితెరను ప్రత్యామ్నాయం చేశారు. అప్పటి నుంచి తెలుగులో టీవీ వినోద రంగంలో పెనుమార్పులు వచ్చాయి. నేడు అన్ని భారతీయ భాషల్లో ఈటీవీ వినోదంతోపాటు న్యూస్‌చానళ్లు ప్రసారమవుతున్నాయి.
ఆంధ్రా, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు రామోజీరావుకు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి సత్కరించాయి. బీడీ గోయంకా అవార్డును 2001లో రామోజీరావు అందుకున్నారు. అదే సంవత్సరం ‘యుద్ధ్వీర్’ అవార్డు, 1994లో పాత్రికేయ రంగానికి చేసిన విశిష్ట సేవలకుగాను కెప్టెన్ దుర్గాప్రసాద్ అవార్డుతోపాటు పద్మవిభూషణ్ పురస్కారం రామోజీని వరించింది.
రామోజీరావు పార్థివదేహానికి ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లిలో ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన బతికుండగానే నాగన్‌పల్లి శివారులో ప్రత్యేకంగా స్మృతివనం నిర్మించుకోగా అక్కడే అంత్యక్రియలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. అధికారిక లాంఛనాలతో రామోజీకి వీడ్కోలు పలికేందుకు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్‌లను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్‌భార్గవ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జీ సాయిప్రసాద్, ఏపీ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ఆర్సీ సిసోడియా ఉన్నారు.
ఈనాడు మీడి యా సంస్థల అధినేత, వ్యాపారవేత్త, సినీ నిర్మాత, జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత, రామోజీ గ్రూప్స్ వ్యవస్థాపకుడు, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు ఆనారోగ్యంతో నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని స్టార్ హాస్పిటల్లో శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన జూన్ 5న తీవ్ర గుండెపోటుతో హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీలో చేరారని, హార్ట్ ఫెయిల్యూర్‌తో పాటు లోబీపీతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని దవాఖానవర్గాలు తెలిపాయి. వెంటిలేటర్‌పై ఉంచి ఐఏబీపీ సా యంతో ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు యాంజియోగ్రామ్ టెస్ట్‌చేసి, స్టంట్వేశామని, అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు, క్రిటికల్ కేర్ బృందాలు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదని వెల్లడించాయి.
రామోజీ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా, ముఖ్యంగా పత్రికారంగానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.