హైదరాబాద్, డిసెంబర్ 9, (నమస్తే తెలంగాణ): వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు సోమవారం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులతో ఏకీభవించింది. పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం జారీచేసిన ఉత్తర్వులపై చెన్నమనేని రమేశ్ 2019లో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఇందులో రూ.25 లక్షలను గత 15 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న పిటిషనర్, ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు అందించాలని, మరో రూ.5 లక్షలు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని తీర్పు చెప్పింది.
భారత పౌరసత్వం కోసం చెన్నమనేని 2008లో దరఖాస్తు చేసుకున్నారు. 2009 ఫిబ్రవరిలో పౌరసత్వం పొందారు. రూల్స్ ప్రకారం ఇలా దరఖాస్తు చేసుకోవడానికి ముందు 12 నెలలు దేశంలో నివాసం ఉండాలి. కానీ, చెన్నమనేని 96 రోజులే ఉన్నారని పిటిషనర్ శ్రీనివాస్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రం 2017లో ఆయన పౌరసత్వాన్ని రద్దుచేసింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పౌరసత్వం చట్టంలోని అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు అప్పుడు కేంద్రాన్ని ఆదేశించింది. తిరిగి 2019 నవంబరు 20న చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం రెండోసారి నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేసి స్టే ఉత్తర్వులతో ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇప్పుడు తీర్పు వెలువడింది.
‘నా పౌరసత్వంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నిరాశపరిచింది..ఈ జడ్జిమెంట్ హేతుబద్ధంగా లేదు’ అంటూ వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఆక్షేపించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. 2019లో తెలంగాణ హైకోర్టు పౌరసత్వ చట్టంలోని 10.3ను తు.చ. తప్పకుండా అమలుచేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఆదేశించిందని గుర్తుచేశారు. ప్రస్తుత తీర్పుపై ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ చేసే విషయాన్ని తన న్యాయవాదులు పరిశీలిస్తున్నారని తెలిపారు. తాను రాజకీయాల్లో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని, ఇప్పుడు కూడా అదేవిధంగా ముందుసాగుతానని స్పష్టంచేశారు. వరుస ఓటములు జీర్ణించుకోలేని వారు ఆక్రోశంతోనే ఈ కేసులు వేశారని ఆరోపించారు. ఏదేమైనా తన ప్రాంతాభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.