కొల్లాపూర్, జూన్ 26 : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో చెంచులపై నరరూప రాక్షసులు అఘాయిత్యాలకు పాల్పడ్డారు. చెంచు మహిళ ఈశ్వరమ్మపై జరిగిన దాష్టీకంపైనే అంతా దృష్టిసారించారు. కానీ, ఈ గందరగోళంలో ఈ నెల 3న ఇంటి నుంచి రాయరాజుల పెంటకు వెళ్లిన చెంచు ఈశ్వరమ్మ మామ చెంచు నాగయ్య 4వ తేదీన శవంగా కనిపించాడు. అదే రోజు నాగయ్య కుటుంబసభ్యులకు కొంతమంది డబ్బు ఆశ చూపి, ఒత్తిడి చేసి మృతదేహానికి పోస్ట్మార్టం చేయించకుండానే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో ‘నమస్తే తెలంగాణ’ బృందం లోతుగా పరిశీలించి నాగయ్య మృతి విషయాన్ని ఈనెల 24న వెలుగులోకి తీసుకొచ్చి ‘ఈశ్వరమ్మ మామను హత్య చేశారా?’ అనే కథనాన్ని ప్రచురించింది.
దీంతో ప్రజా సంఘాల నాయకులు, బాధిత కుటుంబసభ్యులు పోస్ట్మార్టం చేయాలని కోరుతూ సోమవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో భారీ బందోబస్తు మధ్య ఆర్డీవో నాగరాజు, తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్సై రుషికేశ్ పర్యవేక్షణలో నాగయ్య మృతదేహానికి వైద్యులు పోస్ట్మార్టం చేశారు. పరిసర ప్రాంతాల్లోకి మీడియాను కూడా అనుమతించలేదు. నాగయ్య కాళ్లు, ఛాతిపై గాయాలున్నాయని గుర్తించినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో సంచలనంగా మారిన నాగయ్య మృతికి సంబంధించిన వివరాలు పోస్ట్మార్టం నివేదిక ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉన్నది.