హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): దేశ రాజధానిలో పేలిన ఉగ్ర బాంబులతో.. ఇప్పుడు అందరి వేళ్లూ తెలంగాణలోని హైదరాబాద్ వైపే చూపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ వంటి ముఖ్య ప్రాంతాల్లో పలు ఉగ్ర సంస్థలకు చెందిన స్లీపర్‌సెల్స్ తిష్టవేశారనే సమాచారం ఉన్నా.. వారిని రహస్యంగా అరెస్టు చేయడంలో ఇంటెలిజెన్స్ నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయనగరం ఉగ్రవాదులైనా, రామేశ్వరం కేఫ్ బాంబు పేలుైళ్లెనా, ముంబై బ్లాస్ట్లైనా, కశ్మీర్ ఉగ్ర లింకులైనా, ఢిల్లీ మావన బాంబులైనా తెలంగాణలో ఆ ఉగ్రమూకల మూలాలు వెలుగు చూస్తున్నాయి.
దీంతో ఉగ్రవాదం వైపు అడుగులు వేస్తున్న వారిని కట్టడి చేయకపోగా.. రహస్యంగా తెలంగాణలో తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న వారిపై పూర్తిస్థాయిలో నిఘా కొరవడిందని పలువురు రిటైర్డ్ పోలీసు అధికారులు చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పదేండ్ల పాటు సుభిక్షంగా ఉంటే.. నేడు ఎటు చూసినా ఆందోళనలు, అల్లర్లు, ఉగ్రవాదుల అలజడులతో తెలంగాణ శాంతిభద్రతలు లోపించి కునారిల్లుతున్నది. లుంబినీ పార్క్, గోకుల్ చాట్ విషాదం మరవకముందే.. ఢిల్లీలాంటి ఘటనలతో తెలంగాణ ఎంతవరకూ సేఫ్ అనే భావన అందరిలోనూ కలుగుతున్నది.
గుజరాత్ ఏటీఎస్ అదుపులో హైదరాబాదీ..
తెలంగాణ పోలీసులకు, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్‌లకు తెలియకుండా పక్క రాష్ర్టాల పోలీసులు, యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీఎస్)లు, జాతీయ దర్యాప్తు సంస్థలు ఇక్కడికి వచ్చి రహస్యంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారంటే మన పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద కేసుల్లో, ఉగ్ర లింకుల్లో నిందితులను అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్‌కు వెళ్లే వరకూ మనోళ్లకు సమాచారం లేకపోవడం గమనార్హం. ఇటీవల తెలంగాణలో ఉగ్రవాదులు ఉన్నారంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వచ్చి బోధన్‌లో అరెస్టులు చేసింది. తాజాగా ఈనెల 7న ఉగ్రవాది డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీఎస్) హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో అరెస్టు అయిన రిజ్వాన్ అనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు.. తన అరెస్టుకు ముందు 6 నెలలు హైదరాబాద్‌లో గడిపాడంటే మనోళ్లు ఏ స్థాయిలో గస్తీకాస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.
కొరవడిన ఇంటెలిజెన్స్ నిఘా!
తెలంగాణను కొన్ని ఉగ్రవాద సంస్థలు సేఫ్ ప్లేస్‌గా భావిస్తున్నాయని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ్నుంచి కార్యకలాపాలు చేపట్టడంలో ఆరితేరాయంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణలో తలదాచుకుంటున్న ఉగ్రమూకలు, స్లీపర్‌సెల్స్, సానుభూతిపరులపై తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ నిఘా కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మావోయిస్టులు, ఉగ్రవాదులపై నిఘా ఉంచాల్సిన ఇంటెలిజెన్స్ బీఆర్ఎస్ నేతల ఫోన్లను ట్యాప్ చేయడంలోనే కాలం వెల్లదీస్తున్నదని రాజకీయ నేతలంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అమాయక యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నా.. మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన ఉగ్ర కేసులు