ఖిలావరంగల్: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వరంగల్ (Warangal) రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించారు. వరంగల్ జీఅర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలను చేపట్టారు. సీఐ సురేందర్ నేతృత్వంలో స్టేషన్లో ప్రతి మూలనూ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికుల లగేజీ బ్యాగులను తనిఖీ చేసి అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం వదిలేశారు. ప్రయాణికుల వెంట ఉన్న లగేజీ బ్యాగులు, పార్సిళ్లను మెటల్ డిటెక్టర్లు, ఇతర పరికరాల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా రైళ్లు రాకపోకలు సాగించే సమయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఈ సందర్భంగా సీఐ సురేందర్ ప్రయాణికులకు కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రయాణికులు ఎవరైనా అనుమానిత వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు గానీ లేదా నేరుగా జీఅర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులకు లేదా అందుబాటులో రైల్వే అధికారులకు, సిబ్బందికి సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజల సహకారం ఉంటేనే రైల్వే ప్రయాణం సురక్షితంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీలతో వరంగల్ రైల్వే స్టేషన్లో కొద్దిసేపు అప్రమత్తత వాతావరణం నెలకొంది.