పెద్దపల్లి, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ)/మంథని/ మంథని రూరల్ : పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లిలో మానేరు నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్ ధ్వంసానికి కారణం పేల్చివేతనే అని అనుమానాలు బలపడుతున్నాయి. ఘటనా స్థలంలో శిథిలాలను పరిశీలిస్తే దిగువకు కాకుండా ఎగువభాగం వైపు పడి ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఇదే వాదనను ఇంజినీరింగ్ నిపుణులు గట్టిగా వినిపిస్తున్నారు. చెక్‌డ్యామ్ ఎగువభాగంలో ఇసుక అక్రమ రవాణాకు తెరతీసేందుకే పేల్చివేతకు కుట్రపన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంథని ఐబీ డీఈఈ రమేశ్‌బాబు, ఏఈ నిఖిల్ చెక్‌డ్యామ్‌ను ధ్వంసం చేశారని అభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో 12 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని నిలిచిన చెక్‌డ్యామ్.. ఇప్పుడు అతి తక్కువ ప్రవాహం ఉన్నప్పుడు ఎలా కూలిపోతుందని ఫిర్యాదులో అనుమానాలను పేర్కొన్నారు. ఐబీ అధికారులు చెప్తున్నట్టుగా చెక్‌డ్యామ్‌లో కనీసం లక్ష క్యూసెక్కులు కూడా నిల్వ లేని సమయంలో, ఎగువ నుంచి వెయ్యి క్యూసెక్కుల వరద కూడా రాని సమయంలో ఎలా కొట్టుకుపోతుందని, ఇది కచ్చితంగా ధ్వంసమేనని బలంగా చెప్పారు. చెక్‌డ్యామ్ ఘటనపై ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు ముందుగా నిరాకరించినట్టు సమాచారం. ధ్వంసం అనే పదాన్ని తొలగించి, నాణ్యతా లోపంతో కూలినట్టుగా ఫిర్యాదు చేస్తే తీసుకుంటామని పోలీసులు మాట్లాడినట్టు తెలిసింది. చెక్‌డ్యామ్‌ను ధ్వంసం చేశారనడానికి ఉన్న ఆధారాలను ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులు పోలీసులకు చూపించి, గట్టిగా వాదించడంతో అప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం.
చెక్‌డ్యామ్ నిర్మాణ సమయంలో, నిర్మాణం పూర్తయ్యాక విజిలెన్స్, ఎక్స్పర్ట్స్ కమిటీ, క్వాలిటీ కంట్రోల్ అధికారులు సర్టిఫై చేశారని, అలాంటి చెక్‌డ్యామ్ ఇలా ఎలా ధ్వంసమవుతుందని ఇంజినీరింగ్ నిపుణులు, అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే వరంగల్‌కు చెందిన సాయిరాం కన్స్ట్రక్షన్స్ రూ.40 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణ పనుల కాంట్రాక్టును పూర్తి చేసింది. వీరికి సంబంధించిన డిపాజిట్ సైతం ఇంకా ప్రభుత్వం దగ్గరే ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో ఒక వేళ ధ్వంసం కాకపోయి ఉంటే ప్రభుత్వమే విచారణ జరపడంతోపాటు నాణ్యతా లోపాలు ఏమైనా ఉంటే కాంట్రాక్టు కంపెనీకి సంబంధించిన డిపాజిట్ నుంచి రికవరీ చేసుకోవాలి. కానీ ధ్వంసమైన చెక్‌డ్యామ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెక్‌డ్యామ్‌కు బుంగ పడితే శిథిలాలన్నీ దిగువకే కొట్టుకు పోతాయని, చెక్‌డ్యామ్‌పై నుంచి కూడా నీళ్లు దిగువకు వెళ్తున్న పరిస్థితిలో శిథిలాలు ఎగువ వైపు ఎలా పడుతాయని నిపుణులు చెప్తున్నారు. చెక్‌డ్యామ్‌కు సంబంధించి రెండు కాంక్రీట్ బ్లాక్‌లు ఎగిరి అప్‌స్ట్రీమ్‌లో పడడమే కూల్చివేత అనే అనుమానాలకు ఊతమిస్తున్నదని అంటున్నారు. కేసు నమోదైన నేపథ్యంలో చెక్‌డ్యామ్ ప్రదేశాన్ని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మల్హర్ ఎస్ఐ నరేశ్, మంథని ఎస్ఐ డేగ రమేశ్ పరిశీలించారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, పెద్దపల్లి జిల్లాలోని హుస్సేన్‌మియా వాగు, మానేరువాగుపై అనేక చెక్‌డ్యాంలను నిర్మించింది. వేలాది ఎకరాలకు సాగునీరు అందించింది. వందలాది మంది మత్స్యకారులకు ఉపాధి చూపింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ఇసుక దోపిడీ కోసం చెక్‌డ్యామ్‌లపై కుట్రలకు పాల్పడుతూ ధ్వంసం చేస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2024 జనవరిలో పెద్దపల్లి మండలం మూలసాల హుస్సేన్‌మియా వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్ కూల్చివేత కోసం జిలెటిన్‌స్టిక్స్ అమరుస్తుండగా రైతులు రావడంతో అక్రమార్కులు పరారయ్యారు. అక్కడ పేలుడు కోసం ఉపయోగించే జిలెటిన్‌స్టిక్స్, డ్రిల్లింగ్ మిషన్, ట్రాక్టర్ కూడా దొరికాయి. నవంబర్‌లో కరీంనగర్ జిల్లా తనుగుల చెక్‌డ్యాం ధ్వంసం కావడం, ఆ తర్వాత నెలకే పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లి మానేరులోని చెక్‌డ్యామ్ ధ్వంసం కావడంతో అక్రమార్కుల కుట్రలు బహిర్గతమయ్యాయి. చెక్‌డ్యామ్‌లు ధ్వంసమవుతున్నా కుట్రలను నిగ్గుతేల్చడంలో ప్రభుత్వం, పోలీసులు అలసత్వం వహిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యామ్‌ను ముమ్మాటికీ కాంగ్రెస్ నాయకులే పేల్చివేశారు. గతంలో చెక్‌డ్యామ్‌తో ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు స్థానికంగా సర్పంచ్‌గా గెలిచిన తర్వాత అదే విషయాన్ని నిజం చేసి చూపించారు. చెక్‌డ్యామ్ చుట్టుపక్కల గ్రామాలైన అడవిసోమన్‌పల్లి, నాగెపల్లి, వెంకటాపూర్, వల్లెంకుంట, మల్లారంలో కాంగ్రెస్ నాయకులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి సర్పంచ్‌లుగా గెలిచారు. వారంతా ఈ మానేరు వాగులోని ఇసుకపై కన్నేసి ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానాలున్నాయి. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపించాలి.
అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యామ్ విషయంలో అన్ని కోణాల్లో విచారణ జరిపించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరాను. చెక్‌డ్యామ్ ధ్వంసమైనట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాస్తవాలు విచారణలో బయటకు వస్తాయి.
అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యామ్ ధ్వంసం విషయంలో పూర్తిస్థాయి ఎక్స్పర్ట్స్ కమిటీ విచారణ నిర్వహిస్తున్నది. చెక్‌డ్యామ్ ధ్వంసమైనట్టుగానే భావిస్తున్నాం. ఈ నిర్మాణాన్ని సాయిరామ్ కన్స్ట్రక్షన్స్ చేపట్టింది. నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపాలు లేవు.
2023లో మా ఊరిలోకి నీళ్లు వచ్చాయి. ఆ సమయంలో మానేరు వరద సోమన్‌పల్లి బ్రిడ్జిని తాకుతూ వెళ్లింది. అలాంటి వరదకు కూడా చెక్‌డ్యామ్ తట్టుకొని నిలిచింది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ధ్వంసమైనదంటే నమ్మడంలేదు. కాంగ్రెస్ నాయకులే ఇసుక కోసం కూల్చి వేశారని అనుమానాలు కలుగుతున్నాయి. శబ్దం వినిపించిందని మానేరు పక్క పొలాల్లోని రైతులకు, చేపలు పట్టుకునే వారు చెప్తున్నారు. చెక్‌డ్యామ్‌ను చూస్తుంటే పేల్చినట్టుగానే కనిపిస్తున్నది.