పెద్దపల్లి, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ)/మంథని రూరల్: మానేరు నదిపై మరో చెక్‌డ్యామ్ ధ్వంసమైంది. నవంబర్ 21న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల రెండు గ్రామాల శివారు మధ్య మానేరు నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్ పేల్చివేత మరువక ముందే బుధవారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం పీవీనగర్ శివారులోని చెక్‌డ్యామ్ ధ్వంసమైంది. ఉదయం వరకు బాగానే ఉన్న చెక్‌డ్యామ్ మధ్యాహ్నం వరకు కూలిపోయి కనిపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాగును సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మానేరు తీరం వెంట పెద్ద సంఖ్యలో చెక్‌డ్యామ్‌లను నిర్మించింది. ఆ నిర్మాణాలు ఇటీవల వరుసగా కూలిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2023లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి వరదల్లో చిక్కుకున్న సమయంలో దాదాపుగా 12లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం వచ్చినా చెక్కుచెదరని అడవి సోమన్‌పల్లి చెక్‌డ్యామ్, వర్షాలు లేని ప్రస్తుత సమయంలో కేవలం వెయ్యి క్యూసెక్కుల వరద కూడా రానప్పుడు కూలిపోవడం ఏంటని స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చెక్‌డ్యామ్ కూలితే శిథిలాలు దిగువకు కొట్టుకుపోవాలి కానీ, ఎగువకు చెల్లాచెదురుగా పడి ఉండడం చూస్తుంటే.. కచ్చితంగా చెక్‌డ్యామ్‌ను పేల్చివేయడమో, కూల్చివేయడమో చేసి ఉంటారని స్పష్టమవుతున్నదని చెప్తున్నారు. స్థానికంగా నీరు నిలిచి ఉండడం వల్ల చెక్‌డ్యామ్‌కు ఎగువన ఉన్న ఇసుక తరలించుకుపోవడం సాధ్యంకాదనే ఉద్దేశంతోనే ఇసుక మాఫియా ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యామ్‌ను దాదాపు రూ.40 కోట్లతో నిర్మించారు. 2021లో నిర్మాణ పనులు మొదలు పెట్టి, 2023లో పూర్తి చేశారు. 2024లో భారీ వరదల నేపథ్యంలో సైడ్ వల్లస్ను పూర్తి చేశారు. మానేరుకు కుడి, ఎడమ ప్రాంతాల్లో పొలాలకు చెక్‌డ్యామ్ ఉపయోగపడుతూ వచ్చింది. పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగాయి. నదిలో చేపల ఉత్పత్తి విపరీతంగా పెరిగి, మత్స్యకారులకు ఉపాధి లభించింది. బహుళ ప్రయోజనకారిగా మారిన చెక్‌డ్యామ్‌లపై నేడు అరాచక శక్తుల కన్నుపడినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిథిలాలు పడి ఉన్న తీరు చూస్తే.. దుండగులు బాంబులతో పేల్చివేసినట్టు, కూల్చివేసినట్టు కనబడుతున్నది.
ప్రజలు ఇచ్చిన సమాచారంతో జేఈ నిఖిల్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం చెక్‌డ్యామ్‌ను పరిశీలించారు. 120మీటర్ల పొడవున చెక్‌డ్యామ్ ధ్వంసమైనట్టు గుర్తించారు. ఎలాంటి వరదలు లేకున్నా చెక్‌డ్యామ్ ధ్వంసం కావడం అనుమానాలకు తావిస్తున్నదని చెప్తున్నారు. ప్రభుత్వానికి దాదాపుగా రూ.40 కోట్ల నష్టం జరిగినట్టు వివరించారు. చెక్‌డ్యామ్‌ను నూటికి నూరు శాతం ధ్వంసం చేశారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. కాగా, చెక్‌డ్యామ్ కూలిన ప్రదేశం తమ పరిధిలోనికి రాదని మంథని పోలీసులు చెప్పడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని జేఈ వెల్లడించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే 2024 జనవరి 16న పెద్దపల్లి మండలంలోని మూలసాలలో హుస్సేన్‌మియా వాగుపై ఉన్న చెక్‌డ్యామ్‌కు దుండగులు మందుపాతరలు పెట్టి పేల్చడానికి కుట్ర చేశారు. రైతులు చూసి కేకలు వేయడంతో నిందితులు ట్రాక్టర్‌ను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్కరినీ అరెస్టు చేయలేదు. నవంబర్ 21న ఓదెల మండలం గుంపుల చెక్‌డ్యామ్‌ను కూడా దుండగులు పేల్చి వేశారు. ఇదే విషయంపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఒక్కరిని కూడా అరెస్టు చేసినట్టు ప్రకటించలేదు.
చెక్‌డ్యామ్ కూలిపోయి ఉన్నట్టు మాకు సమాచారం వచ్చింది. వెంటనే క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలించాం. పెద్దగా ఎలాంటి వరదలు లేవు. కానీ చెక్‌డ్యామ్ ఇంతలా ఎలా ధ్వంసమైందనేది అనుమానాలకు తావిస్తున్నది. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాం.
– నిఖిల్, ఇరిగేషన్‌శాఖ ఏఈ (మంథని)