Charlapalli Railway Station | తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో కొత్తగా నిర్మించిన చర్లపల్లి టర్మినల్ రైల్వే స్టేషన్ సోమవారం ప్రారంభం కానున్నది. రిమోట్ వీడియో లింక్ ద్వారా చర్లపల్లి టర్మినల్ రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. సోమవారం ఉదయం 10.15 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ రెండో ప్రవేశ ద్వారం వద్ద ప్రారంభ వేడుక జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం ఏ రేవంత్ రెడ్డి, కేంద్ర భూగర్భ గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి, రైల్వేశాఖ సహాయ మంత్రి వీ సోమన్న, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ ఐటీ మంత్రి డీ శ్రీధర్ బాబు, ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొంటారు. దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కూడా హాజరవుతారు. దక్షిణ మధ్య రైల్వే నెట్ వర్క్ పరిధిలో చర్లపల్లి రైల్వే స్టేషన్ కీలకం కానున్నది. హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్య పరిష్కరించడంతోపాటు ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి టర్మినల్ రైల్వే స్టేషన్ నిర్మించారు.