శంకరపట్నం, ఫిబ్రవరి 18 : విలేకరి ముసుగులో ఓ వ్యక్తి అర్చకుడిని నిలువునా ముంచాడు. ఎస్సారెస్పీలో పోయిన భూమి పట్టా చేయిస్తానని రూ.31.50 లక్షలు వసూలు చేసి, నకిలీ ప్రొసీడింగ్ చేతిలో పెట్టాడు. బాధితుడి కథనం మేరకు వివరాలు.. మానకొండూర్ మండలం పచ్చునూర్‌కు చెందిన వైరాగ్యపు రాజమల్లయ్య అనే అర్చకుడు మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి, ఊటూరు, పచ్చునూరు గ్రామాలు, శంకరపట్నం మండలం చింతగుట్టలో పౌరోహిత్యం చేస్తూ కుంటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతడికి పచ్చునూర్లో ఏడెకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో ఎకరం పహానీకి రావడంలేదు. ఈ క్రమంలో 2023లో శంకరపట్నం మండలం తాడికల్‌కు చెందిన మాచర్ల రాజయ్య తన తల్లి దశదినకర్మ సందర్భంలో అర్చకుడు రాజమల్లయ్యతో పరిచయం ఏర్పరచుకున్నాడు. పహానీకి రాని భూమిని రికార్డులకు ఎక్కిస్తానని ఖర్చుల పేరిట రూ.లక్షకు పైగా వసూలు చేశాడు.
రెవెన్యూ అధికారులు ప్రొసీడింగ్ జారీ చేశారని ఓ నకిలీ జిరాక్స్ పత్రాన్ని చేతిలో పెట్టాడు. ఎస్సారెస్పీ కెనాల్ కింద పోయిన వ్యవసాయ భూములకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిస్తుందని, రూ.96 లక్షల వరకు పరిహారం వచ్చేలా ఉన్నతాధికారులతో చేసి పెడతానని అర్చకుడికి ఆశ చూపాడు. నమ్మిన రాజమల్లయ్య మే 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు రాజయ్య అకౌంటుకు విడతలవారీగా రూ. 31.50 లక్షల వరకు చెల్లించాడు. రాజయ్య వివిధ దశలలో పని ఉందని, నకిలీ పత్రాలతో నమ్మిస్తూ కాలం గడిపాడు. చివరకు మోసపోయానని గ్రహించి పెద్ద మనుషుల సాయంతో నిలదీస్తే డబ్బులు తిరిగి ఇస్తానంటూ తెల్ల కాగితం రాసి చేతిలో పెట్టాడు. ఎన్ని వాయిదాలు గడుస్తున్నా డబ్బులు మాత్రం ఇవ్వలేదు. దీంతో మంగళవారం కేశవపట్నం పోలీసులను ఆశ్రయించాడు. తెలిసిన వారి వద్ద అప్పులు తెచ్చి రాజయ్యకు ఇచ్చానని, విలేకరి ముసుగులో తనను నిలువునా ముంచాడని విలపించాడు. తనకు న్యాయం చేయకపోతే చావే గతి అని వేడుకున్నాడు.