వరంగల్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసనతో రచ్చరచ్చ అయింది. జీడబ్ల్యూఎంసీ బడ్జెట్ సమావేశం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన గురువారం కౌన్సిల్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.650.12 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన బడ్జెట్‌ను మేయర్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మద్దతుతో నిరసనల మధ్యే ఏకపక్షంగా బడ్జెట్‌ను ఆమోదించారు. ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభం కాగానే.. రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగించేలా ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, కాకతీయుల రాజధాని వరంగల్ కార్పొరేషన్లో ఈ మేరకు తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని బీఆర్ఎస్కు చెందిన డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు పట్టుపట్టారు.
వీటిని పట్టించుకోకుండా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్టు మేయర్ గుండు సుధారాణి ప్రకటించడంతో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు పోడియం వద్దకు దూసుకుపోయి ఆమెతో వాగ్వాదానికి దిగారు. నిరసనలు, నినాదాల మధ్య జేఏవో సరిత బడ్జెట్‌ను చదువుతుండటంతో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చేతుల నుంచి బడ్జెట్ ప్రతులను లాక్కొని చించేశారు. మిగిలిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ సీట్ల వద్ద నిల్చొని పెద్దఎత్తున జై తెలంగాణ నినాదాలు చేశారు. ప్రతిగా కాంగ్రెస్ కార్పొరేటర్లు జై కాంగ్రెస్ నినాదాలు చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి అడుగడుగునా పోలీసులను మోహరించారు. కౌన్సిల్ హాల్ వైపు ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కార్పొరేటర్లను తనిఖీ చేసి కౌన్సిల్ హాల్‌కు అనుమతించారు. కాగా.. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్య బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్టు ప్రకటించిన మేయర్ సుధారాణి వెంటనే కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు ఆమెను అనుసరించారు. బీఆర్ఎస్ సభ్యులు అక్కడి నుంచి కౌన్సిల్ హాల్ గేటు వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలపగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పాల్గొన్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు మధ్య తోపులాటలతో ఉద్రికత్త నెలకొంది.