నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్లో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తున్నది. ఉత్తరభాగంలోని పలుచోట్ల కేంద్రం రూపొందించిన అలైన్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలంగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఇప్పటికే ఉండగా, తాజాగా ప్రకటించిన దక్షిణభాగం అలైన్‌మెంట్‌లోనూ ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకున్నట్టు తెలిసింది. చౌటుప్పల్ నుంచి మొదలయ్యే దక్షిణభాగంలో ఇప్పటికే సర్వే చేసిన రూట్లలో కాకుండా మరో రూట్లో అలైన్‌మెంట్‌ను ఖరారు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంత రైతుల్లో ఆందోళన మొదలైంది. గత నెల 30న ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను విడుదల చేస్తూ హెచ్ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీచేసింది. దీనిపై ఈ నెల 15వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది.
బాధిత రైతులు దీనిని తమ ఆందోళనకు వేదికగా మార్చుకోవడంతో అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయం రైతుల ఆందోళనతో అట్టుడుకుతున్నది. చౌటుప్పల్‌ను ఆనుకుని తూర్పున హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రీజినల్ రింగ్‌రోడ్డులో ఉత్తర, దక్షిణ భాగాలు కలిపే జంక్షన్‌ను ప్రతిపాదించారు. ఈ జంక్షన్ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోనే ఏర్పాటు కానుంది. గతంలో ఉత్తర భాగం అలైన్మెంట్ ఖరారు చేసే క్రమంలో కేంద్రం ఇక్కడ జంక్షన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వాహనాల ఇంటర్చేంజ్ వ్యవస్థ కోసం, సర్వీసు రోడ్లు తదితర అవసరాల కోసం 78 ఎకరాల భూమి అవసరం అవుతుందని ప్రకటించింది. దానికి అనుగుణంగా అప్పట్లో సర్వే బృందాలు మార్కింగ్ చేసి స్థానికులకు చెప్పాయి. ఈ అలైన్మెంట్తో కొన్ని వ్యవసాయ భూములతోపాటు ప్లాట్లు, ఇండ్లు పోతున్నాయి. ఇందులో భూములు, ప్లాట్లు పోతున్నవారిలో కొందరు ప్రతిపాదిత జంక్షన్ ఏరియా దాటి ఇండ్ల కోసం ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.
ఉన్నట్టుండి రెండింతలు పెరిగిన జంక్షన్
జంక్షన్‌ను 78 ఎకరాల్లో నిర్మించాలని తొలుత నిర్ణయించగా, ఇక్కడ డంబెల్ ఆకారంలో 181 ఎకరాల్లో జంక్షన్ నిర్మించాలని నిరుడు ఆగస్టులో ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దీంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ ట్రిపుల్ ఆర్ తూర్పు, పడమర భాగాలుగా చీలిపోనుంది. 1,2,3 వార్డుల పరిధిలోని లింగారెడ్డిగూడెం, తాళ్లసింగారం, లింగోజీగూడెం ట్రిపుల్ఆర్ మరోవైపునకు వెళ్లనున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో చౌటుప్పల్ జంక్షన్‌ను హైవేకు ఇరువైపులా 1,350 మీటర్ల పొడవుతో డంబెల్ ఆకారంలో నిర్మించనున్నారు. దీనివల్ల ఇరువైపులా కలిపి రైతుల నుంచి అదనంగా 103 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఈ కారణంగా బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. పాత అలైన్మెంట్ ప్రకారం భూములు తీసుకుంటే తమకు కొన్నైనా మిగిలేవని, కానీ, ఇప్పుడు కొత్త అలైన్మెంట్తో భూములన్నీ పోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతోనే..
గత ప్రభుత్వ హయాంలో దక్షిణభాగం అలైన్‌మెంట్‌ను కేంద్రం ఫైనల్ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పెద్దలు ఇందులో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. చౌటుప్పల్ నుంచి చేవెళ్ల మీదుగా కంది వరకు గల దక్షిణభాగంలోనూ గతంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రాథమిక సర్వే జరిపి అలైన్‌మెంట్‌ను సిద్ధం చేశారు. అయితే దీన్ని కాదంటూ రాష్ట్ర ప్రభుత్వం ‘సొంత’ అవసరాల పేరిట అలైన్మెంట్లో ఇష్టారాజ్యంగా మార్పులకు సిద్ధపడింది. అందులో భాగమే చౌటుప్పల వద్ద జంక్షన్ విస్తరణ అని తెలిసింది. దీనికి అనుబంధంగా తాజాగా హెచ్ఎండీఏ ప్రకటించిన దక్షిణభాగం అలైన్మెంట్ కూడా ఇందులో భాగమేనన్న చర్చ జరుగుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో అలైన్మెంట్ పలుచోట్ల ప్రభుత్వ పెద్దలకు అనుగుణంగా వంకర్లు తిరిగినట్టు అనుమానాలు వ్యక్తమువుతున్నాయి. చాలా చోట్ల ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ట్రిపులార్‌కు 35 నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉంటే చౌటుప్పల్‌తో పాటు దక్షిణ భాగంలో పలుచోట్ల 27-35 కిలోమీటర్లకే కుదించుకుపోయిందని అలైన్‌మెంట్‌ను పరిశీలిస్తే అర్థం అవుతుంది. ఇదే అంశం బాధిత రైతుల్లో ఆగ్రహావేశాలకు కారణం అవుతున్నది. అందుకే నిత్యం రోడ్లెక్కుతున్నారు. పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిపుల్ఆర్ నిర్మాణం చేపట్టాలని, లేదంటే మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ. 60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.