హైదరాబాద్, అక్టోబర్6 (నమస్తే తెలంగాణ): గురుకుల పనివేళలను ప్రభుత్వం వెంటనే మార్చాలని గురుకుల సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. జేఏసీ నేతలు మామిడి నారాయణ, డాక్టర్ మధుసూదన్, నరసింహులు గౌడ్, గణేశ్, భిక్షంయాదవ్, వేదంతాచారి ఆదివారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 662 వరకు గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లోనే ఉన్నాయని, విద్యార్థులు మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వమే అంగీకరిస్తున్నదని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం మార్చిన పనివేళలు విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలను మరింత తీవ్రం చేస్తున్నదని వెల్లడించారు. గతంలో మాదిరిగా పనివేళలను ఉదయం 9 నుంచి 4:30 గంటల వరకు పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తున్న మెస్చార్జీలను పెంచాలని కోరారు. అనేక సమస్యలను ప్రభుత్వానికి నివేదించామని, అయినప్పటికీ స్పందన లేదని వాపోయారు. ఇకనైనా సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార, మంత్రులు స్పందించి గురుకుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.