హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి చర్చించేందుకు ఈ నెల 14న ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారని ఏపీ వర్గాలు వెల్లడించాయి. ప్రాజెక్టుకు ఆర్థిక సాయంతోపాటు, అనుమతుల మంజూరుపై వారు చర్చించనున్నట్టు చెప్తున్నారు. పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఆర్థికసాయం అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరడం, అందుకు సానుకూలత వ్యక్తం కావడం తెలిసిందే.
అయితే ఇటీవల ప్రాజెక్టుకు తొలిదశ పర్యావరణ అనుమతుల మంజూరుకు ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) తిరిస్కరించింది. ఏపీ సమర్పించిన పీబీ లింక్ ప్రాజెక్టు (ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టు)పై సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ, గోదావరి రివర్‌బోర్డు సైతం అనేక సందేహాలను లేవనెత్తాయి. మరోవైపు ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నట్టు ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాలు వెల్లడించాయి.