జడ్చర్ల, డిసెంబర్ 24 : తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఏపీ సీఎం చంద్రబాబుకు తెలిసే తిరస్కరిస్తున్నారని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆరోపిపంచారు. ఇటీవల టీటీడీలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు చెల్లుబాటుకాని విషయాన్ని అనిరుధ్‌రెడ్డి తిరుమలకు వెళ్లిన సమయంలో మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణకు వచ్చిన ఆంధ్రా మంత్రి ఒకరు.. టీటీడీ కొత్త పాలకమండలి ఏర్పడిన తర్వాత ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. కొత్త పాలకమండలి ఏర్పడిన తర్వాత కూడా పురోగతి లేదని అనిరుధ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ విషయమై తెలంగాణకు చెందిన టీటీడీ బోర్డు మెంబర్లు, టీడీపీ నాయకులు ఏపీ ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఏపీ సీఎం, టీటీడీ ఆలయ అధికారుల ధోరణి మారకపోతే తెలంగాణలోని జోగుళాంబ నుంచి బాసర దాకా, భద్రాచలం నుంచి చిలుకూరి బాలాజీ ఆలయం వరకు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ఆంధ్రా వీఐపీల సిఫారసు లేఖలను ఆమోదించకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు.