Chandrababu | హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : గోదావరి జలాలను బనకచర్లకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే అదే తొండి వాదన వినిపిస్తున్నారు. ఒకవైపు, తెలంగాణ నీళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే.. దీనివల్ల తెలంగాణకు ఎలాంటి నష్టంలేదని చెప్పుకొస్తున్నారు. బనచర్లకు గోదావరి జలాలను తీసుకొస్తానని ఏపీ ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గోదావరిలో మిగులు జలాలను తాము వాడుకుంటున్నామంటూ వితండవాదన చేశారు. గోదావరి నీళ్లు బనకచర్లకు వస్తే అక్కడ కరువు అనే మాటే వినిపించదని, ఇందులో భాగంగానే పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
తెలంగాణను ఎండబెట్టి, ఏపీకి నీళ్లు తరలించే కుట్రలపై మండిపడుతున్నారు. చంద్రబాబు గోదావరి జలాలను ఏపీకి తరలించుకొని పోయేందుకు అంత పట్టుదలతో ఉంటే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ చేష్టలుడిగి చూస్తున్నదని విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బనచర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని మండిపడుతున్నారు. బనచర్లకు వ్యతిరేకంగా ఢిల్లీలో, కేంద్రం వద్ద పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ సర్కార్.. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తూ కూర్చుంటున్నదని, దీనివల్ల ఒరిగేదేమిటని ప్రశ్నిస్తున్నారు. నష్టం జరుగుతున్నదని చెప్తున్న ప్రభుత్వం.. మరి ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇక హైదరాబాద్‌పై కూడా చంద్రబాబు తనకు అలవాటైన వ్యాఖ్యలను మరోసారి చేశారు. హైదరాబాద్ తన వల్లే అభివృద్ధి చెందిందని పాత రికార్డును మరోసారి వినిపించారు.