ఖిలా వరంగల్, జూన్ 21 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అగ్గిమీద గుగ్గిలం అవుతుంటే.. పుండుమీద కారం చల్లినట్టు ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగం తెలంగాణ రాజముద్ర(కాకతీయ కళాతోరణం)నే కలవరానికి గురిచేసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం శనివారం విశాఖపట్నంలో నిర్వహించగా ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టి ప్రదర్శించారు. మిగతా రాష్ర్టాల్లో కేవలం ప్రధాని ప్రసంగాన్ని లైవ్ టెలికాస్ట్ చేసి, తెలంగాణలో మాత్రం ప్రధానితో పాటు చంద్రబాబు ప్రసంగాన్ని ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రసారం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటన్న వాదన వినిపిస్తున్నది.
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ ఏకశిలా కీర్తితోరణాల మధ్య యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఈడీ స్క్రీన్‌లో ఉదయం 6.38 గంటల నుంచి 7 నిమిషాలపాటు చంద్రబాబు ప్రసంగిస్తూ.. ‘రికార్డులను సృష్టించేది.. రికార్డులను బ్రేక్ చేసేది ప్రధాని నరేంద్రమోదీ, వికసిత్ భారత్‌లో భాగంగా 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధిస్తుంది.. తెలుగుజాతి గర్వపడేలా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని జీవన విధానంగా మార్చుకొని తెలుగుజాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి, జై భారత్.. జై ఆంధ్రప్రదేశ్’ అని పేర్కొన్నారు. ఈ ప్రసంగంపై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర రాజముద్ర సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిందని, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రస్థానం, చంద్రబాబు గొప్పతనం తమకెందుకని యోగా శిబిరంలో పాల్గొన్నవారు ప్రశ్నిస్తున్నారు. కాకతీయ కీర్తితోరణాల సాక్షిగా చంద్రబాబు ప్రసంగాన్ని ప్రచారం చేసి తెలంగాణకు అపకీర్తిని ఆపాదించారని వరంగల్ 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమ పేర్కొన్నారు. ఏకశిలా తోరణాల మధ్య యోగాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్ వంటి నినాదాలు చేయడం దారుణమని మండిపడ్డారు.
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమం అభాసుపాలైంది. మ్యాట్లు, ఆహార ప్యాకెట్ల సంచులను కొందరు ఎత్తుకెళ్లారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాని మోదీ వస్తున్నాడని గిరిజన ప్రాంతాల నుంచి విద్యార్థులను తరలించి వారికి వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. కనీసం కప్పుకోవడానికి బెడ్ షీట్లు కూడా ఇవ్వకపోవడంతో నేలపైనే విద్యార్థులు పడుకున్నారు.
కొంతమంది మహిళలు వసతులు సరిగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకు తీసుకొచ్చారని తిండి లేదని తిరిగి వెళ్లడానికి కూడా బస్సులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 175 దేశాల్లో యోగా సాధన చేయడం సాధారణ విషయం కాదన్నారు. యోగా మానవతను పెంచే ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. దాదాపు 3.3 లక్షల మంది వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమానికి తొలిసారి రెండు గిన్నిస్ బుక్ రికార్డులు దక్కినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేశ్ పాల్గొన్నారు.