Operation Musi | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): కాలాలు మారినా పేదల తలరాతలు మారలేదనడానికి ‘మూసీ’ కంటే మంచి ఉదాహరణ ఉండదేమో. 1999-2001 చంద్రబాబు పాలనా కాలంలో మూసీ పేదల మెడపై వేలాడిన కత్తి.. మళ్లీ ఇప్పుడు ఆయన సహచరుడు రేవంత్ హయాంలో భయపెడుతున్నది. నాడు, నేడు సేమ్ టు సేమ్. అడ్డగోలుగా పేదల తరలింపే లక్ష్యం. నాడు ప్రతిపక్షాలు విజయవంతంగా అడ్డుకోవడంతో ఆగిన కత్తిని దశాబ్దాల తర్వాత మళ్లీ రేవంత్ ఝళిపిస్తున్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు రేవంత్ చెప్తున్నట్టు ఆయన మానస పుత్రిక కాదని, చంద్రబాబు హయాం లో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టును ఇప్పుడు రేవంత్ తలకెత్తుకున్నారని పలువురు హక్కుల కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు! లక్షన్నర కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో ఏంచేయాలి? ఎట్లచే యాలి? ఎక్కడెంత ఖర్చు పెట్టాలి? అన్నింటికీ ఒక రూట్‌మ్యాప్‌ను రూపొందించే ‘గురు’తర బాధ్యతను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మెయిన్‌హార్ట్ అనే ఒక కన్సల్టెన్సీ కంపెనీ చేతుల్లో పెట్టిం ది. ఇంతకీ ఈ కంపెనీ ఎవరిదో తెలుసా? ఏపీ సీం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, అమరావతి గ్రా ఫిక్స్ సూత్రధారి, ప్రస్తుతం జైల్లో ఉన్న సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్‌కు చెందినది. 166.48 కోట్లతో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మాస్టర్‌ప్లాన్ బాధ్యతలను మెయిన్‌హార్ట్ కన్సార్టియంకు అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం ఈ నెల 4న ఉత్తర్వులు జారీచేసింది. పబ్లిక్ డొమైన్లో మాత్రం ఈ ఉత్తర్వులను (జీవో ఆర్టీ నెం.472, 4.10.2024) అందుబాటులో ఉంచలేదు.
‘బాబు’ హయాంలో ‘నందనవనం’
మూసీ సుందరీకరణ ప్రాజెక్టును వాస్తవంగా కేసీఆర్ హయాంలోనే రూపొందించారు. అప్పుడు తయారుచేసిన ప్రతిపాదనల ప్రకారమే మేం ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు కొన్ని రోజుల కిందట ప్రకటించారు. అంటే కేసీఆర్ ప్రభుత్వమే ఈ సుందరీకరణ ప్రాజెక్టును తెరపైకి తెచ్చిందనే అభిప్రాయాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల్లోకి వదిలింది. కానీ చరిత్ర తిరగేస్తే, అసలు మూసీ సుందరీకరణ అనే దానిని తెరపైకి తెచ్చింది సాక్షాత్తూ చంద్రబాబునాయుడు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి. నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 1999-2001 సమయంలో ఈ ప్రాజెక్టు అమలులో ఉన్నట్టుగా సీనియర్ అధికారులు తెలిపారు. ‘నందనవనం’ పేరిట మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ నుంచి నాగోల్ వరకు 14 కిలోమీటర్ల మేర మూసీ సుందరీకరణ చేపట్టాలనేది ప్రతిపాదన. ఇందులో భాగంగా శంకర్‌నగర్, మూసానగర్, కమల్‌నగర్ తదితర మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అక్కడి నుంచి తరలించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వారందరికీ ఒకచోట ప్రభుత్వపరంగా వసతి కల్పించేందుకే కర్మన్‌ఘాట్ సమీపంలో ‘నందనవనం’ అనే భారీ గృహ సముదాయాన్ని నిర్మించింది.
ఈ మేరకు చాలామంది నిరుపేదలను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. చాలామంది వ్యతిరేకించి తాము ఖాళీ చేసేదిలేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. సుందరీకరణలో భాగంగా కులీ కుతుబ్‌షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)తో కోట్లాది రూపాయల పనులు చేపట్టారు. కానీ ఇందులో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకోవడంతో అప్పుడు ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. అప్పటి హైదరాబాద్ కలెక్టర్ కూడా అవినీతి వాస్తవమేనని తేల్చడంతో కుడాకు పనుల అప్పగింతను నిలిపివేస్తున్నట్టు అప్పటి పురపాలకశాఖ మంత్రి ఎంఎన్డీ ఫరూఖ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మూసీలో వేల క్యూసెక్కుల వరద వస్తుందనే రికార్డులు ఉండగా… కేవలం పది మీటర్ల సెంట్రల్ ఛానెల్‌ను నిర్మించి అందులోకి వరదను మళ్లిస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించడంపై తాము ఆయన ముందే నవ్వి మౌనంగా వచ్చామని సామాజిక కార్యకర్త ఒకరు తెలిపారు. అందుకు ఆ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు హౌస్ కమిటీకి కూడా డిమాండు చేశాయి. కాంగ్రెస్ తరఫున ప్రస్తుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీజేపీ తరపున అప్పటి బీజేఎల్పీ నేత, ప్రస్తుత త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మూసీ సుందరీకరణ పనుల్లో అవినీతి, ఇతరత్రా అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాలక్రమేణా సుందరీకరణ ప్రాజెక్టు తెరమరుగైంది.
వైఎస్ హయాంలో సేవ్ మూసీ
ఉమ్మడి ఏపీలో 2004 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ‘సేవ్ మూసీ’ పేరిట 2005లో ప్రాజెక్టును చేపట్టింది. ఇదే విషయాన్ని ఇటీవల కేవీపీ కూడా సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో ప్రస్తావించారు. 908 కోట్లతో పథకాన్ని ప్రారంభించినప్పటికీ అప్పు డు ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్య అంశాల దృష్ట్యా దీనిపై పెద్దగా దృష్టిసారించలేదని పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ వల్ల నష్టపోయే ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి సంతృప్తికరంగా నష్టపరిహారం చెల్లించాలంటే భారీ మొత్తం నిధులు అవసరమవుతున్నందున కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోయిందని పేర్కొన్నారు. ముఖ్యంగా తొలుత మూసీ నది ప్రక్షాళన, ఆపై సుందీరకరణ ప్రాజెక్టును రెండో దశలో చేపట్టాలని కూడా కేవీపీ సూచించారు. గతంలోని వైఎస్ సర్కారు కూడా ప్రక్షాళనపైనే నిధులు వెచ్చించింది. అంబర్‌పేట, నాగోల్, అత్తాపూర్ ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించింది.
అప్పుడు బాబు.. ఇప్పుడు ఆర్బీ-ఎక్స్
మూసీ సుందరీకరణ పేరు 1999లో తెరపైకి రాగా అప్పట్లో మూసీ పరీవాహక ప్రాంత ప్రజల కంటి మీద కునుకు లేకుండా పోయిందని నగరానికి చెందిన పలువురు హక్కుల నేతలు గుర్తు చేసుకున్నారు.
మూసీ వయా అమరావతి!
మూసీ రివర్ డెవపల్‌మెంట్ ప్రాజెక్టుకు మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను మూడు కన్సల్టెన్సీల కన్సార్షియంకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీన పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిశోర్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) ప్రతిపాదన మేరకు మెయిన్హర్ట్ సింగపూర్ ప్రైవేటు లిమిటెడ్‌తో పాటు కుష్మన్ వేక్ ఫీల్డ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, ఆర్ఐవోఎస్ డిజైన్ స్టూడియోస్ ప్రైవేటు లిమిటెడ్ అనే మూడు కన్సల్టెన్సీ కంపెనీల కన్సార్టియంకు బాధ్యత అప్పగించేందుకు పాలనా అనుమతినిస్తూ కన్సార్టియంతో ఒప్పందానికి కూడా ఆమోదం తెలిపింది. ఇందుకుగాను కన్సార్టియంకు రూ.166.48 కోట్లు (రూ.25.40 కోట్ల జీఎస్టీతో కలుపుకొని) చెల్లించనున్నట్టు అందులో పేర్కొన్నారు. ప్రధానమైన మెయిన్హర్ట్ కంపెనీలో కీలకమైన భాగస్వామి సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్. తమిళనాడుకు చెందిన ఈయన అమరావతి రాజధాని గ్రాఫిక్ డిజైన్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. అంటే ఏపీ సీఎం చంద్రబాబుకు ఈశ్వరన్ అత్యంత సన్నిహితుడనేది బహిరంగ రహస్యం. అమరావతి నగరాభివృద్ధి బాధ్యతను అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం సెమ్కాప్ అండ్ అసెండర్స్ సింగ్‌బ్రిడ్జి (మెయిన్హర్ట్ అనుబంధ సంస్థ)కు అప్పగించింది. ఈ సంస్థలో ప్రధాన పెట్టుబడిదారు, డైరెక్టర్ ఈశ్వరన్. ఈయనకు మెయిన్హర్ట్లో కూడా ప్రధాన వాటాలున్నాయి.
కేసీఆర్ హయాంలో విజయవంతంగా ప్రక్షాళన
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్)ను ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఒక రోజు, ఒక ఏడాదిలో మూసీ మురుగుగా మారలేదు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే మూసీ మురికికూపంలా మారింది. రాత్రికి రాత్రి మూసీ సుందరీకరణ పూర్తవదనే కేసీఆర్ ప్రభుత్వం అంచెలంచెలుగా ప్రణాళిక రూపొందించింది. భారీ ఎత్తున మురుగునీటి శుద్ధి కేంద్రాలను చేపట్టిం ది. తెలంగాణ ఏర్పడేనాటికి నగరంలో రోజుకు 1950 మిలియన్ లీటర్ల మురుగు ఉత్పత్తి అవుతుంటే అందులో కేవలం 772 మిలియన్ లీటర్లు మాత్రమే శుద్ధి అవుతుంది. మిగిలిన 1178 మిలియన్ లీటర్లు రోజూ మూసీలో కలుస్తుంది. అందుకే కేసీఆర్ ప్రభుత్వం 3866 కోట్లతో 31 శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) నిర్మాణం చేపట్టింది. గత డిసెంబరు వరకు పనులు శరవేగంగా జరిగాయి. అందు లో 6 కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. గత 10 నెలలుగా రేవంత్ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే వంద శాతం మురుగు శుద్ధి జరుగుతుంది. రేవంత్ ప్రభుత్వం ఇలాంటి కీలక అంశాలపై దృష్టిసారించకుండా రాత్రికి రాత్రి బుల్డోజర్లతో నిరుపేదల ఇండ్ల కూల్చివేతలను భుజాన వేసుకుంది.