మంథని రూరల్, జూన్ 8: పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల పార్వతీ బరాజ్‌ను విచారణ కమిటీ కమిషనర్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ శనివారం పరిశీలించారు.ఆయనతోపాటు బృం దం సభ్యులు బరాజ్‌కు చేరుకొని పైనుంచి కింద భాగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఘోష్ అధికారులతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత బరాజ్ కింది భాగానికి దిగిన ఘోష్.. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. గతంలో జరిగిన లోపాలు, ప్రస్తుతం జరుగుతున్న మరమ్మతు పనుల నివేదిక సోమవారం వరకు ఇవ్వాలని ఆదేశించారు. బరాజ్ సందర్శనకు ముందు రామగిరి మండలం సుందిళ్లలో ఉన్న లక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో జస్టిస్ ఘోష్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఎస్ఈ కరుణాకర్, ఈఈ శ్రీధర్ ఓంకార్ సింగ్, డీఐవో శ్రీనివాస్, డీఈఈ లక్ష్మీనారాయణ, నరేశ్, ఏఈ ఈ విశ్వేశ్వర్రావు, శ్రీకాంత్ ఉన్నారు.