మంచిర్యాల, జూలై 3 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా. పైగా అధిక వర్షపాతం నమోదవుతుంది. కానీ జిల్లాలో సాగునీరు అందక లక్షలాది ఎకరాలు బీడు భూములుగా దర్శనమిస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంతవరకు వెనుకబడిన జిల్లాల జాబితాలో మొదటి వరుసలో ఉంటూ కేవలం వర్షాధారిత పంటలతోనే లక్షలాది మంది రైతులు జీవనం సాగిస్తూ వచ్చారు. చనాక-కొరాట వంటి చారిత్రక ప్రాజెక్టులపై 1978లోనే అప్పటి ఉమ్మడి ఏపీ-మహారాష్ట్ర మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగింది. కానీ తెలంగాణ ఏర్పడేనాటికి సైతం ఆ ఒప్పందానికి బూజుపట్టిందే తప్ప ఏ ఒక్కరూ దానిని తెరిచి చూసిన దాఖలాల్లేవు.
స్వరాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం ఆ చారిత్రక ప్రాజెక్టు బూజు దులిపి.. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని, అప్పటికప్పుడు ప్రాజెక్టు నిర్మాణానికి ఆ రాష్ట్రం ముందుకు రాకున్నా కేసీఆర్ ప్రభుత్వమే ప్రత్యేక చొరవ తీసుకొన్నది. ఆదిలాబాద్ జిల్లా రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని భోరజ్ మండలం కొరాట వద్ద చనాక-కొరాట ప్రాజెక్టును పట్టాలెక్కించింది. ఒకే దఫాలో రూ.1,227 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చి చకచకా పనులు చేపట్టింది. చనాక-కొరాట బరాజ్ నిర్మాణంతో పాటు పంపుహౌస్, ప్రధాన కాలువ పనులు పూర్తిచేసిన ఆనాటి కేఈఆర్ ప్రభుత్వం.. ట్రయల్న్ నిర్వహించి జలాలను ఎత్తిపోసింది.
కేసీఆర్ హయాంలోనే బరాజ్, పంపుహౌస్, ప్రధాన కాలువల నిర్మాణం పూర్తవడంతోపాటు 1.42 టీఎంసీల నీటి నిల్వకోసం భీంపూర్ మండలం పిప్పల్‌కోట్ వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాన్ని కూడా చేపట్టింది. రూ.360 కోట్ల అంచనా విలువతో చేపట్టిన ఈ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా 200 ఎకరాల భూసేకరణతో రిజర్వాయర్ కట్ట నిర్మాణాన్ని కూడా పూర్తిచేసింది. మరో 800 ఎకరాల భూములను సేకరిస్తే అందులో నీటిని నిల్వచేసి 58వేల ఎకరాలకు పుష్కలంగా శాశ్వతంగా సాగునీటిని అందిస్తే రైతుల దశాబ్దాల కల సాకారమవుతుంది. కానీ, 2023 డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు వంక కన్నెత్తి చూడలేదు. కనీసం సమీక్షించిన సందర్భాలు లేవు. అసలు ఇంతవరకు 800 ఎకరాల భూసేకరణ ప్రక్రియపై ఏనాడూ ప్రభుత్వం దృష్టిసారించనేలేదు.
ఆదిలాబాద్ జిల్లా రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సాగునీటిని పక్కనబెట్టి.. ఆగమేఘాలపై ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణను భుజానికెత్తుకోవడంపై అందరిలోనూ అనుమానాలు రేకెత్తించింది. చనాక-కొరాట ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమం మొదలు సీఎం కోటరీ హెలికాప్టర్ పర్యటన వరకు అడగడుగునా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ప్రభుత్వ పెద్దలు ఆడిన దోబూచులాట, రహస్య పర్యటనలు, మంతనాలు అనుమానాలకు బలాన్ని చేకూర్చాయి. పైగా ప్రాజెక్టులోని రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఏఒక్కనాడూ ఎమ్మెల్యే నోటివెంట మాట రాకుండా కేవలం ఇండస్ట్రియల్ పార్క్ మంత్రాన్నే జపించడంతో అందరూ లోతుగా పరిశీలించడం మొదలుపెట్టారు. చివరకు తనఖా భూముల్లో అనకొండల బాగోతం ఎట్టకేలకు బట్టబయలైంది. రైతులు డిమాండ్ చేస్తున్న సాగునీటిని అందించేందుకు కేవలం 800 ఎకరాలు సేకరిస్తే సరిపోతుంది. రూ.200-300 కోట్లతో 1.42 టీఎంసీలను నిల్వచేసి 58వేల ఎకరాలకు ఏటా రెండు పంటలకు సాగునీటిని అందించవచ్చు. కానీ దానిని పక్కనబెట్టి.. రాత్రికిరాత్రి వందల పరిశ్రమలు క్యూకడుతున్నట్టుగా ప్రతిపాదన పురుడు పోసుకొన్న ఆరునెలల్లోపే 3వేల ఎకరాల భూసేకరణ ప్రక్రియ శరవేగంగా ముందుకుపోతుందంటేనే ‘దాల్మే కుచ్ కాలాహై!’ అని అందరికీ అర్థమవుతుంది.
కాంగ్రెస్-బీజేపీ బలమైన బంధంతో తెరపైకి వచ్చిన 10 వేల ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదనలో ఇప్పటివరకు 2,200 ఎకరాలకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కూడా సిద్ధం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో లే అవుట్ అభివృద్ధికి రూ.3వేల కోట్లతో పాటు కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు నిధులు తెచ్చేందుకు కూడా తెరవెనుక కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. ఇందులో కీలకమైన విషయమేందంటే? అసలు ఆ డీపీఆర్‌లో ఏయే పరిశ్రమలు వస్తున్నాయనే వివరాలే లేనట్టు తెలిసింది. కేవలం పరిశ్రమల క్యాటగిరీలను మాత్రమే పేర్కొనగా.. చనాక-కొరాట ప్రాజెక్టుకు అతి సమీపంలో రెడ్‌జోన్‌లో పరిశ్రమల ఏర్పాటును కూడా డీపీఆర్‌లో పొందుపరచడమంటే పచ్చనిచేలల్లో కాలుష్యం చిచ్చు పెట్టేందుకు కూడా వీళ్లు వెనుకాడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చనాక-కొరాట.. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలోని ఆరు మండలాల బీడు భూములకు జీవం పోసే చారిత్రక ప్రాజెక్టు. నాలుగున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మహారాష్ట్రతో ఒప్పందం జరిగిన ప్రాజెక్టు ఇది. 40 ఏండ్లపాటు పడావుపడిన ఈ ప్రాజెక్టుపై తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని రూ.1,227 కోట్ల పాలనా అనుమతితో పట్టాలెక్కించారు. బరాజ్, పంపుహౌస్, ప్రధాన కాలువల నిర్మాణాన్ని పూర్తిచేసి, సాగునీటిని విడుదల చేశారు. పిప్పల్‌కోట్ వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తిచేస్తే 1.42 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. కేవలం 800 ఎకరాల భూమిని సేకరించి రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తిచేస్తే 58 వేల ఎకరాలకు పుష్కలంగా శాశ్వతంగా సాగునీరు అందించొచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు దాటింది. గుంట భూసేకరణ కూడా చేయలేదు. అసలు ఈ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కానీ నీటిపారుదల శాఖ మంత్రి కానీ సమీక్ష చేసిన దాఖలాల్లేవు. అలాంటప్పుడు స్థానిక ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఏం చేయాలి? 800 ఎకరాల భూసేకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఆదిలాబాద్.. అసెంబ్లీ.. వేదిక ఏదైనా రిజర్వాయర్ నిర్మాణం ఎప్పుడు పూర్తిచేస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీయాలి.
మరి.. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎప్పుడైనా, ఏ ఒక్కరోజైనా చనాక-కొరాట ప్రాజెక్టు ఊసెత్తారా? చివరకు సీఎం రేవంత్‌రెడ్డి చనాక-కొరాట బరాజ్ నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసే సమయంలో పక్కనే ఉన్న పాయల్ శంకర్ రైతుల గోసను సీఎంకు వివరించారా? 800 ఎకరాలు సేకరిస్తే 58 వేల ఎకరాలు పచ్చని మాగాణం అవుతుందని చెప్పారా? బహిరంగ సభలోనైనా సీఎం, ఎమ్మెల్యే పరస్పరం ప్రశంసలు కురిపించుకున్న సమయంలోనైనా తన నియోజకవర్గంలోని రైతులు దశాబ్దాలుగా సాగునీరు అందక అవస్థలు పడుతున్నారంటూ పల్లెత్తు మాటైనా మాట్లాడారా?
ప్రాజెక్టు సంగతేమో కానీ.. సీఎం రేవంత్‌తో కలిసి హెలికాప్టర్ ఏరియల్ వ్యూలో మాత్రం 10 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుపై ఎంచక్కా ముచ్చటించారు. పట్టుబట్టి నెలన్నరలోనే సీఎం కోటరీతో కలిసి ఇండస్ట్రియల్ పార్కుకోసం రెండోసారి ఏరియల్ వ్యూ చేయించారు. దశాబ్దాల తరబడి అలమటిస్తున్న ఆదిలాబాద్ అన్నదాతలకు సాగునీరు అందించడం అభివృద్ధి కాదా? ఇండస్ట్రియల్ పార్కు కోసం 10 వేల ఎకరాలకు గాను కేవలం ఆరు నెలల్లోనే మూడు వేల ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్లు ఇప్పించగలిగిన పాయల్ శంకర్ పిప్పలికోట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం 800 ఎకరాల భూసేకరణను పూర్తి చేయించలేకపోయారా? నదీజలాలను ఒడిసిపట్టి రైతులకు అందించడం అభివృద్ధిలో భాగమా? రూపురేఖలు లేని ఇండస్ట్రియల్ పార్కు కోసం వేల ఎకరాల భూసేకరణకు ఆరాటపడటం అభివృద్ధి అవుతుందా? ఆదిలాబాద్ అన్నదాతలు చేసిన పాపమేంది? తెరవెనుక పెద్దల కోసం తెరపైన కనిపించే కార్పొరేట్ సిమెంట్ కంపెనీలు చేసిన పుణ్యమేంది? జిల్లా అభివృద్ధి కోసమే జట్టుకట్టామంటున్న కాంగ్రెస్-బీజేపీ బంధమే ఆయా అంశాలకు సమాధానాలు చెప్పాలి.
కాంగ్రెస్ సర్కార్ చనాక-కొరాట ప్రాజెక్టును పట్టించుకోకపోగా, స్థానిక శాసనసభ్యుడు పాయల్ శంకర్ సైతం ఈ ప్రాజెక్టును విస్మరించడం శోచనీయం. తన నియోజకవర్గ పరిధిలో 58 వేల ఎకరాలకు శాశ్వత సాగునీటి కల్పన జరుగుతుందంటే కాలికి బలపం కట్టుకొన్నట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తి చేయించాల్సిన ఎమ్మెల్యే.. ఏనాడూ దానిని పట్టించుకోలేదు. కనీసం అసెంబ్లీలోనూ పెద్దగా ప్రస్తావించలేదు. ఒకవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చనాక-కొరాట ప్రాజెక్టులో మిగిలిన భూసేకరణ అంశాన్ని కాలగర్భంలోకి నెట్టివేశారని ఈ ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల భూములకు సాగునీరు అందించడానికి నిర్మించిన పిప్పల్‌కోట్ ప్రాజెక్టు పనుల్లో రెండున్నరేండ్లుగా ఎలాంటి పురోగతి లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.368 కోట్లతో రిజర్వాయర్‌ను మంజూరు చేసి పనులను ప్రారంభించింది. ఎలాంటి సాగునీటి సౌకర్యం లేని మా గ్రామ రైతులు ఈ ప్రాజెక్టు వల్ల తమ భూములకు సాగునీరు అందుతుందని రెండు పంటలు సాగు చేసుకోవచ్చని ఆశించారు. ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం 800 ఎకరాల భూసేకరణను పక్కనపెట్టి రైతుల ప్రయోజనాలను కాదని బడాబాబుల పరిశ్రమల కోసం ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టింది.
మా ప్రాంత రైతులు ఎలాంటి సాగునీటి సౌకర్యం లేకుండా వర్షాలపై ఆధారపడి వానకాలం పంటలను సాగుచేస్తూ ఉపాధి పొందుతున్నారు. పిప్పల్‌కోట్ రిజర్వాయర్ పనులు పూర్తయితే రెండు పంటలు పండించుకొనే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి సాగునీరు ఎప్పుడు వస్తుందా? అని ఆశతో ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం కేవలం 800 ఎకరాల భూ సేకరణ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. రెండున్నరేండ్లుగా భూ సేకరణ జరుపకుండా ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం వేల ఎకరాల భూములను సేకరిస్తుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కండ్లముందు నీళ్లున్నా భూములకు పారించుకునే పరిస్థితి లేదు.