హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని, రైతురుణ విముక్తి చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న చేపట్టిన చలోరాజ్‌భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ, ఆదివాసీ అటవీ హకుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక, మహిళా, విద్యార్థి, యువజన, బీసీ సంఘాల నేతలు శుక్రవారం పశ్యపద్మ అధ్యక్షతన హైదరాబాద్ మఖ్దూంభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చలోరాజ్‌భవన్ నిర్వహించాలని నిర్ణయించారు. అందులోభాగంగా ఈ నెల 19న కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, జంగారెడ్డి, చంద్రశేఖర్, రణధీర్, రాంబాబు, కోటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల మల్లేశ్, ఆదివాసీ అటవీ హకుల పరిరక్షణ సమన్వయ కమిటీ కన్వీనర్లు అంజయ్య నాయక్, మహిళా సంఘాల నాయకులు ఝాన్సీ, పుస్తెల సృజన, ఐఎఫ్టీయు నాయకురాలు అరుణ, విద్యార్థి సంఘం, యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.