హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): జీవో-317పై సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ కాలయాపనపై తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉద్యోగులంతా జేఏసీగా ఏర్పడి అక్టోబర్ 2న చలో గాంధీభవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 9 నెలలు వేచిచూశామని, ఇక ఓపిక నశించిందని, పోరాటమే శరణ్యమని నేతలు ప్రకటించారు.
జీవో-317ను సమీక్షించి బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ సర్కారు పరిష్కరించకపోవడంతో బాధిత ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంటున్నది. మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కాలయాపన చేయడంపై రగిలిపోతున్నారు. జీవో-46, జీవో-317పై సమీక్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.
మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కూడిన సబ్ కమిటీ పలుమార్లు భేటీ అయి పూర్తి వివరాలను సేకరించింది. పలుమార్లు సబ్‌కమిటీ భేటీలు నిర్వహించినా ఇంతవరకు ఏదీ తేల్చలేదు. ఈ కాలయాపనను జీర్ణించుకోలేకపోతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనబాట పట్టేందుకే సిద్ధమవుతున్నారు.
చలో గాంధీభవన్ కార్యక్రమానికి జీవో-317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీగా తరలిరావాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. నిరుడు అక్టోబర్ 2న కాంగ్రెస్ అధికారంలో వస్తే 48 గంటల్లో జీవో-317 బాధితులకు న్యాయం చేస్తానని రేవంత్ మాటిచ్చి తప్పారని నేతలు ధ్వజమెత్తుతున్నారు.