హిమాయత్‌నగర్/కోటగిరి, జూలై 31: సెంట్రలైజ్డ్ కిచెన్ విధాన నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని బుధవా రం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఎస్‌ఎన్‌రెడ్డి భవన్ నుంచి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. ర్యాలీగా బయలుదేరిన మధ్యాహ్న భోజన కార్మికులను నారాయణగూడ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.
అనంతరం అఖిల భారత మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జాతీయ అధ్యక్షురాలు బీవీ విజయలక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేంపావని, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్‌తో కలిసి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్‌పరం చేసే ప్రతిపాదనను వెనక్కి తీసుకొని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశా రు. మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ధ్వజమెత్తారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10 వేల పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియ న్ నాయకులు జంపాల రవీందర్, రమేశ్, ఎస్ విజయలక్ష్మి, డీ కమలారెడ్డి, కే రాములు, సుగుణ, చక్రపాణి, రాంమూర్తి, ముంతాజ్ బేగం, మల్లికార్జున్, రామకృష్ణ, కరుణకుమారి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి తహసీల్ కార్యాలయం ఎదుట బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేశారు. బకాయిలను విడుదల చేస్తామని ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు.