హైదరాబాద్, సెప్టెంబర్28 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురుకుల విద్యా జేఏసీ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన చాక్‌డౌన్, పెన్‌డౌన్ కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లోని బోధన, బోధనేతర ఉద్యోగులు ఎక్కిడికక్కడ విధులను బహష్కరించారు. పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ప్రభుత్వం ఇటీవల మార్చిన గురుకులాల పనివేళలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. గురుకుల ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సౌకర్యాలను కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మెస్‌చార్జీలను పెంచాలని, భవనాల కిరాయిలు ఇవ్వాలని, 317 ఉద్యోగుల సమస్యలతో సహా ఇతర అన్ని అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
లేదంటే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నేతలైన సీహెచ్ బాలరాజు, కే యాదయ్య, పీ రుషికేశ్ కుమార్, కేవీ చలపతి, డీ బాలస్వామి, ఆవుల సైదులు, ఎస్ ఝాన్సీరాణి, డాక్టర్ టీ సాంబలక్ష్మి, జానీమియా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.