హైదరాబాద్ సిటీబ్యూరో/ఖైరతాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్లు 130,135లోని 18ఎకరాలలో ఉన్న తమ 400 ప్లాట్ల కబ్జాకు సర్వే అధికారులు, పోలీసుల సహకారంతో కీర్తి కావేరి ప్రాపర్టీస్ మేనేజింగ్ పార్ట్ట్‌నర్ కృష్ణంరాజు అనే వ్యక్తి యత్నిస్తున్నారని చక్రపురి నేతాజీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. కబ్జాకు నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ రఘువీర్‌రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ప్లాట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వర్రావు, ఉపేందర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. 1986లో కొన్న తమ ప్లాట్లను 2006లో కబ్జా చేశారని, అప్పటినుంచి తాము పోరాటం చేస్తూనే ఉన్నామని తెలిపారు. 2018లో భూముల సర్వే తర్వాత పర్మినెంట్ ల్యాండ్ మార్క్స్ పెట్టి, ట్రైజంక్షన్‌ను ఖరారు చేసిన తర్వాత మళ్లీ కృష్ణంరాజు అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్లారని తెలిపారు. సర్వేకు హైకోర్టు ఆదేశించిందని, సర్వే అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రీసర్వే చేయాలంటూ అధికారులను వేడుకున్నా ఫలితం లేదని, అందుకే నేటి నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీ అండతోనే!
కబ్జా నుంచి తమ ప్లాట్లను రక్షించుకునేందుకు 20 ఏండ్లుగా పోరాడుతున్నామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఐలాపూర్, అమీన్పూర్, బొల్లారం మూడు ఊళ్లకు నిర్ణయించిన ట్రైజంక్షన్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ట్రైజంక్షన్, బై జంక్షన్ మొదలైన శాశ్వత గుర్తులను పరిగణనలోకి తీసుకోకుండా సర్వే నిర్వహించిన 18ఎకరాల సరిహద్దు మార్పు పెద్ద కుంభకోణం అని అభివర్ణించారు. ఈ సర్వే సరిహద్దులను మార్చడం వల్ల 400మంది ప్లాట్ల యజమానులపైనే కాకుండా అమీన్పూర్ సర్వే నంబర్లపై ప్రభావం ఉంటుందని చెప్పారు.
అమీన్పూర్లో సర్వేకు హైడ్రా సిద్ధం
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో భూముల సర్వేకు సిద్ధమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. పార్కులు, రోడ్డు, ప్లాట్లను గోల్డెన్ కీవెంచర్స్ వారు ఆక్రమించారంటూ వెంకటరమణకాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ కాలనీ, రంగారావు వెంచర్, చక్రపురి కాలనీ వాసులు కూడా ఏమైనా కబ్జాలుంటే నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని రంగనాథ్ సూచించారు.