పాలకుర్తి, మార్చి 7 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, చాకలి (చిట్యాల) ఐలమ్మ మనుమడు, పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రాంచంద్రం(76) అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. రాంచంద్రం 1953లో ఐలమ్మ పెద్ద కుమారుడు చిట్యాల కట్టెల సోమయ్యకు మూడో సంతానంగా జన్మించాడు. 1981లో పాలకుర్తి సర్పంచ్‌గా సీపీఎం నుంచి పోటీ చేసి అప్పటి సర్పంచ్ వీరమనేని కిషన్‌రావును ఓడించి చరిత్ర సృష్టించాడు. పాలకుర్తిలో 100 ఫీట్ల వెడల్పుతో రోడ్డును వేసి రికార్డు సాధించాడు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశాడు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రాంచంద్రం భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంగంరెడ్డి పృధ్వీరాజ్, ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి, ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీరెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోల్ ఆనందభాస్కర్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి సంతాపం వ్యక్తంచేశారు. ప్రభుత్వం తరఫున అదనపు కలెక్టర్ ఫర్మర్ పింకేశ్‌కుమార్, ఆర్డీవో డీఎస్ వెంకన్న రాంచంద్రం మృతదేహానికి పూలమాలలు వేసి కుటుంబసభ్యులకు రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. రాంచంద్రం కుటుంబసభ్యులను జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోన్లో పరామర్శించారు. రాంచంద్రం ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. త్వరలో రాంచంద్రం కుటుంబ సభ్యులను కలుస్తానని చెప్పారు.