హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణను చూసి కేం ద్ర ప్రభుత్వం ఓర్వలేకపోతున్నదని రెడో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ కనుసన్నల్లో నడిచే మీడియా సంస్థలు, ఆ పార్టీ వేసే ఎంగిలి మెతుకుల కు ఆశపడి సోషల్‌మీడియాలో తెలంగాణపై విషం కక్కుతున్నాయని మండిపడ్డారు. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ చైర్మన్ యంగ్ లియూ స్వయంగా రాష్ర్టానికి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతామని ప్రకటిస్తే.. జీర్ణించుకోని బీజేపీ, ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నదని ధ్వజమెత్తారు.
దాదాపు ఐదేండ్లుగా ఫాక్స్‌కాన్‌తో సంప్రదింపులు జరిపి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేలా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు చేసిన విషయాన్ని స్వయంగా యంగ్ లియూ స్పష్టంచేసిన విషయాన్ని గుర్తుచేశారు. త్వరలోనే తాము కొంగరకలాన్‌లో ఎలక్ట్రానిక్ పార్ను ఏర్పాటు చేస్తామని యం గ్ లియూ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ లో పేర్కొన్నట్టు గుర్తుచేశారు. రాష్ర్టానికి ఇంతపెద్ద సంస్థ రావడం, మరో లక్షమందికి ఉపాధి దొరకడం బీజేపీకి రుచించటం లేదని దుయ్యబట్టారు. చీప్ ట్రిక్స్‌తో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నదని అన్నారు.