హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): శాసన మండలిలో విపక్ష సభ్యులకు సభలో మాట్లాడటానికి తగిన సమయం ఇస్తామని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ శాసన మండలిలోని తన చాంబర్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు జాతీయ స్థాయిలో ఆదరణ ఉంటుందని, కొన్ని రాష్ర్టాల్లో రాజకీయ శూన్యత ఉన్నదని చెప్పారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినా పార్టీ సింబల్, నాయకుడు మారలేదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు తమకు కావాలని ఇతర రాష్ర్టాల ప్రజలు భావిస్తున్నారని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం సర్దుకుంటుందని ముందే చెప్పానని, తమిళనాడు తరహాలో తెలంగాణలో గవర్నర్ ప్రసంగం ఉండదని అనుకుంటున్నానని, కేంద్రం చెప్పినట్టు రాష్ర్టాల గవర్నర్లు వ్యవహరిస్తున్నారని సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. గవర్నర్, ప్రభుత్వం, అసెంబ్లీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయని చెప్పారు. తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ప్రభావం ఉండదని, కర్ణాటకలో ఉంటే ఉండొచ్చని అన్నారు. దేశ వ్యాప్తంగా చట్ట సభలు నడిచే సమయం తగ్గుతున్నదని పేర్కొన్నారు. తన కుమారుడికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, పోటీ చేయాలా? వద్దా? అనేది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. నల్లగొండలో ఈ సారి బీఆర్ఎస్కు మంచి స్థానాలు వస్తాయని అన్నారు. నల్లగొండ జిల్లాలో వామపక్షాల పొత్తు కలిసి వస్తుందని చెప్పారు. తనకు మంత్రి జగదీశ్‌రెడ్డికి ఎలాంటి విభేదాలు లేవని, తాను ఎవరితో పంచాయితీ పెట్టుకోనని, తాను ఎవరి వ్యవహారాల్లో తలదూర్చనని స్పష్టం చేశారు. టీడీపీ చచ్చిపోయిన పార్టీ అని, ఇప్పుడు దానికి జీవ గంజి పోసే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.