హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ, బీజేవైఎం దాడులు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ఢిల్లీలో మద్యం వ్యాపారంతో ఆమెకు సంబంధాలున్నాయని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ చేసిన వ్యాఖ్యల ఆధారంగా దాడులకు పాల్పడటం సరైన చర్య కాదన్నారు. నిజంగా ఆధారాలుంటే బయటపెట్టి చర్యలు తీసుకోవాలి తప్ప, ప్రత్యర్థులపై బురుద చల్లడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు.
తాము అధికారం చేపట్టాలని లేదా చేయిజార్చుకున్న రాష్ట్రాలలో ప్రత్యర్థి పార్టీలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ ఐటీ దాడులను ఉద్దేశపూర్వకంగా ప్రయోగిస్తున్నదనేందుకు తెలంగాణ, బీహార్, ఢిల్లీలో జరుగుతున్న దాడులు, ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు ప్రయత్నం బీజేపీ అనైతిక కార్యక్రమాలకు నిదర్శనమన్నారు. ఆధారాలుంటే ఖచ్చితంగా చర్య తీసుకోవాలే తప్ప, రాజకీయ ప్రయోజనాలకు వీటిని వాడటం సబబు కాదని చాడ అన్నారు. రాష్ట్రంలో ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తూ, రెచ్చగొట్టే విధంగా రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్న విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.