హైదరాబాద్, జనవరి 27 (నమస్తేతెలంగాన): మల్టీపర్పస్ హెల్త్ వరర్(మహిళ) పోస్టుల సంఖ్య పెంచాలని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోస్టులు పెంచడంతోపాటు పరీక్షకు అర్హతలేని వారికి రూ.10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్తోపాటు 100 శాతం జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సో మవారం రెండో ఏఎన్ఎంలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎన్హెచ్ఎం కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా రెండో ఏఎన్ఎంలతో పని చేయించుకున్న ప్రభుత్వాలు రిటైర్మెంట్ సమయంలో ఉత్తిచేతులతో పంపడం సమంజసం కాదని పేర్కొన్నారు.
ఓ వైపు ఉద్యోగాన్ని వదులుకోలేక, మరోవైపు చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించలేక కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారని ఆరోపించారు. 2021లో పీఆర్సీ అమల్లోకి వస్తే ఇప్పటివరకు బకాయిలు చెల్లించకపోవడం అధికారుల లోపమే అని పేర్కొన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిషార పోరాటానికి సీపీఐ మద్దతిస్తుందని చాడ వెంకట్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ, కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, రెండో ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జకుల పద్మ, కార్యదర్శి బోయిని శ్యామల తదితరులు పాల్గొన్నారు.