వేలేరు, జూలై 13: హనుమకొండ జిల్లా వేలేరు మండల మాజీ జడ్పీటీసీ, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోదరి చాడ సరితారెడ్డి (48) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 2019లో వేలేరు మండల తొలి జడ్పీటీసీగా బీఆర్ఎస్ తరఫున సరితారెడ్డి ఎన్నికయ్యారు. ఎల్లవేళలా ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అధికారులను సమన్వయపరుస్తూ విశేష సేవలందించారు. సరితారెడ్డి ఆకస్మిక మరణం నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు తీరనిలోటని పలువురు సంతాపం వ్యక్తంచేశారు. సరితారెడ్డి మృతికి భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఒక ప్రకటనలో సంతాపం తెలిపింది. సరితారెడ్డి మృతికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
మాజీ జడ్పీటీసీ, తన సోదరి చాడ సరితారెడ్డి మరణం బాధాకరమని వేలేరు మండల వాసి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో విచారం వ్యక్తంచేశారు. ఆమెకు ఆరునెలలుగా సరైన వైద్య చికిత్సలు అందించినా నేడు తుదిశ్వాస విడవడం బాధాకరమని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే తన సోదరి కొత్త మండలమైన వేలేరు జడ్పీటీసీగా ఎన్నికకావడం, తదనంతరం మండల అభివృద్ధి కోసం తనపై ఒత్తిడి తెచ్చి అనేక అభివృద్ధి పనులను చేయించారని గుర్తు చేసుకున్నారు. వేలేరు మండలం ఏర్పాటు, ధర్మసాగర్ నుంచి డబుల్ రోడ్డు, మండలంలోని ఎత్తయిన ప్రాంతాలకు దేవాదుల పైప్‌లైన్ ద్వారా సాగునీరు, రైతుల కోసం సబ్ మార్కెట్‌యార్డు ఏర్పాటు, మహిళా సంఘాల సభ్యులకు భవనాల నిర్మాణం కోసం ఎంతగానో కృషిచేశారని కొనియాడారు.
ఎవరు ఏ సమయంలో సంప్రదించినా, అధికారులతో కానీ, తన దృష్టికి తీసుకొచ్చి పనులు చేయించారని తెలిపారు. తనకు ఎన్ని సమస్యలున్నా నిత్యం ప్రజాసమస్యల పరిష్కారానికి విశేష కృషి చేశారని తెలిపారు. రాజకీయాల్లో సాదాసీదాగా ఉంటూ, పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారని తెలిపారు. సరితారెడ్డి మరణం తనకు వ్యక్తిగతంగా పూడ్చలేనిదని, మండల ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు తీరనిలోలని పేర్కొన్నారు. సోదరి సరితారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి భరోసా ఇచ్చారు.