Nitrate Pollution | న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 440 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో నైట్రేట్ అత్యధికంగా ఉన్నట్లు కేంద్ర భూగర్భ జలాల మండలి (సీజీడబ్ల్యూబీ) వెల్లడించింది. 20 శాతం నమూనాల్లో అనుమతించదగినదాని కన్నా ఎక్కువ నైట్రేట్ ఉన్నదని గుర్తించినట్లు తెలిపింది. నైట్రేట్ కాలుష్యం వల్ల పర్యావరణం, ప్రజారోగ్యం దెబ్బతింటాయి. ముఖ్యంగా నైట్రోజన్ ఆధారిత ఎరువులు, పశువుల పెంటలను ఉపయోగించే వ్యవసాయ ప్రాంతాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
9.04 శాతం నమూనాల్లో ఫ్లోరైడ్ స్థాయిలు సురక్షిత పరిమితి కన్నా అధికంగా ఉన్నట్లు, 3.55 శాతం నమూనాల్లో ఆర్సెనిక్ కాలుష్యం ఉన్నట్లు సీజీడబ్ల్యూబీ విడుదల చేసిన వార్షిక భూగర్భ జలాల నాణ్యత నివేదిక-2024 తెలిపింది. నైట్రేట్ స్థాయిలు 40 శాతానికిపైగా నమూనాల్లో కనిపించిన రాష్ర్టాలు రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు కాగా, మహారాష్ట్రలో 35.74 శాతం, తెలంగాణలో 27.48 శాతం, ఆంధ్ర ప్రదేశ్లో 23.5 శాతం, మధ్య ప్రదేశ్లో 22.58 శాతం నమూనాల్లో నైట్రేట్ అధికంగా కనిపించింది. ఉత్తరప్రదేశ్, కేరళ, జార్ఖండ్, బీహార్ రాష్ర్టాల్లో నైట్రేట్ స్థాయి తక్కువగా ఉంది.
సురక్షిత పరిమితి పరిధిలో ఉన్న రాష్ర్టాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్. నైట్రేట్ స్థాయులు మితిమీరితే శిశువుల్లో బ్లూ బేబీ సిండ్రోమ్ వంటి సమస్యలు వస్తాయి. ఈ నీరు తాగడానికి సురక్షితమైనది కాదు. భూగర్భ జలాల్లో నైట్రేట్ అత్యధికంగా ఉన్న జిల్లాలు దేశవ్యాప్తంగా 15 కాగా, వీటిలో తెలంగాణలోని రంగారెడ్డి, ఆదిలాబాద్, సిద్ధిపేట; ఏపీలోని పల్నాడు ఉన్నాయి.