Bandi Sanjay | హైదరాబాద్-కరీంనగర్ -మంచిర్యాల రాజీవ్ రహదారి నాగుపాములా అధ్వాన్నంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. క్వాలిటీ లేకుండా పనులు చేయడంవల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని తెలిపారు. రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ మేరకు నితిన్ గడ్కరీ హామీ కూడా ఇచ్చారని తెలిపారు. అయితే ఆ రోడ్డుకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సదరు కాంట్రాక్టర్‌తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ చూపాలని సూచించారు.
కొమరం భీం జిల్లాలో రూ.6100 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన పలు రహదారులకు కేంద్ర రోడ్లు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, ఎంపీలు వంశీ, నగేశ్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఒకప్పుడు వెనుకబడిన జిల్లా అని తెలిపారు. రోడ్లు, రహదారుల వ్యవస్థ ఘోరంగా ఉండేదని అన్నారు. కానీ ఇవాళ కరీంనగర్ నుంచి ఇక్కడికి గంటన్నరలోపే వచ్చానని. తెలంగాణలో ఎక్కడికైనా సరే… పొద్దున్నే పోయి పని చూసుకుని మళ్లీ సాయంత్రానికి ఇంటికి రాగలుగుతున్నామని తెలిపారు. దీనికి కారణమేంటి? ఒక్కసారి పదేళ్ల క్రితానికి, ఇప్పటికీ ఉన్న తేడాను గుర్తు చేసుకోండి అని సూచించారు.
ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం కాదు. గత పాలకులు వెనుకబడేసిన జిల్లా అని బండి సంజయ్ విమర్శించారు. గత పదేండ్లలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం1.25లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. అనేక జాతీయ రహదారి ప్రాజెక్టులు, కీలక ఎకనామిక్ కారిడార్లు, పర్యాటక ప్రోత్సాహక ప్రాజెక్టుల అభివృద్ధి శరవేగంగా సాగుతోందని తెలిపారు. దేశాభివృద్ధిలో తెలంగాణ ప్రత్యేకించి హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తోందంటే మౌలిక సదుపాయల కల్పన వల్లే సాధ్యమైందని తెలిపారు.