హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) :‘మీరు కడుపునిండా తినండి. బిల్లు నేనే కడతా.. అన్నాడట ఒకాయన. నాకు ఆకలిగా లేదంటే. లేదు.. లేదు మొహమాట పడొద్దు. పుష్టిగా తినండి అన్నాడట. తీరా తిన్నాక.. ఇప్పుడు నా దగ్గర డబ్బుల్లేవు. మీ బిల్లు మీరే కట్టుకోండి అని అనేశాడట’. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అడ్మిషన్లు పొం దిన విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉన్నది. ఫీజులు చెల్లిస్తామని, రీయింబర్స్మెంట్ హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ వాటిని చెల్లించడం లేదు.
విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా బడా కాలేజీలు ఫీజు బకాయి చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని తెగేసి చెప్తున్నాయి. పరీక్షలప్పుడు ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఒకవేళ కట్టకపోతే కోర్సు పూర్తయినా, విద్యాసంవత్సరం ముగిసినా విద్యార్థులకు సర్టిఫికెట్లు చేతికందడం లేదు. ప్రభుత్వం ఇవ్వదు మీరే కట్టాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు.
అడ్మిషన్ సమయంలోనే..
బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీల యా జమాన్యాలు ట్రెండ్ మార్చాయి. కొన్ని కాలేజీతైలే అడ్మిషన్ సమయంలోనే ఫీజులు గుంజుతున్న ఘటనలు వెలుగుచూశాయి. నిరుడు జూన్‌లో డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్ల సమయంలో ఇదే జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు సైతం పోటీపడి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశాయి. ముందు కట్టిన వారికే అడ్మిషన్లు ఇచ్చాయి. తాము ఫీజు రీయింబర్స్మెంట్ కోటాలో అడ్మిషన్ పొందామని విద్యార్థులు మొత్తుకున్నా.. అదేం లేదు పొమ్మని చెప్పేశాయి. చాకలి ఐలమ్మ యూనివర్సిటీలోని కోఠి మహిళా కాలేజీ, నిజాం కాలేజీ, సైఫాబాద్ పీజీ కాలేజీలు కూడా ఫీజులు వసూలు చేయడం గమనార్హం.
నలిగిపోతున్న విద్యార్థులు
నిజానికి ఫీజు రీయింబర్స్మెంట్ సామాజిక భద్రతతో ముడిపడిన పథకం. లక్షలాది విద్యార్థులకు భరోసా. కానీ ఇప్పుడా భద్రత.. భరోసా రెండూ దూరమయ్యాయి. ప్రభుత్వం రూపాయి ఇవ్వదు. తల్లిదండ్రులు లక్షలాది రూపాయల ఫీజులు కట్టలేరు. ఒకవైపు మొత్తంగా ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న కాలేజీలు.. మరోవైపు భరోసానివ్వని సర్కార్. ఈ ఇద్దరి మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారు. రాష్ట్రంలో 33-40 వరకు కాలేజీల్లో బీటెక్ ఫీజు లక్ష దాటింది. నాలుగేండ్లకు ఈ కాలేజీల్లోని విద్యార్థులు నాలుగు లక్షలకుపైగా ఫీజు కట్టాల్సిందే. గండిపేటలోని ఓ కాలేజీలో ఫీజు రూ.1.6లక్షలు ఉన్నది. మరో కాలేజీ ఫీజు రూ.1.4 లక్షలు ఉన్నది. ఈ కాలేజీల్లోని విద్యార్థులు రూ.6లక్షలు కట్టాల్సిన పరిస్థితులున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వడ్డీలకు అప్పులు తెచ్చి కడుతున్నారు.
కొలువులొచ్చినా.. కష్టాలే
రీయింబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థులకు కొలువులొచ్చినా ఇబ్బందులు తప్పడం లేదు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ప్యాకేజీతో పేరు న్న కంపెనీల్లో ఉద్యోగం వచ్చినా.. ఆ సంతోషం విద్యార్థుల ముఖాల్లో కనిపించడం లేదు. లక్షల్లో ఫీజు బకాయిలుండటం.. ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు చేతికందే పరిస్థితి ఉన్నది. విదేశీ చదువులకు వీసా వచ్చిన వారైతే విదేశీ విద్యారుణాలకు తోడు మళ్లీ అదనంగా అప్పులు చేయాల్సి వస్తున్నది. ఎడ్యుకేషన్ లోన్ల కోసం ఆపసోపాలు పడ్డ విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం మళ్లీ అప్పులు చేసేందుకు సిద్ధపడుతున్నారు.
ఆదేశాలు బేఖాతరు
మొత్తం ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామనడంతో కొందరు విద్యార్థులు ఇటీవల విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫీజులు వసూలు చేయవద్దని, సర్టిఫికెట్లు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు హెచ్చరించినా కాలేజీల యాజమాన్యాలు ఖాతరు చేయడం లేదు. దీంతో అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి తలెత్తింది.
వెనక్కి ఇవ్వడం అనుమానమే
విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను కాలేజీలు మళ్లీ వెనక్కి ఇస్తున్నాయా? అంటే అనుమానంగానే కనిపిస్తున్నది. పేరుకు ఆయా ఫీజులను వెనక్కి ఇచ్చేస్తామని కాలేజీలు చెబుతున్నా, ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాతే ఇచ్చేస్తామంటున్నాయి. కానీ నిజానికి వాపసు చేసిన దాఖలాలు తక్కువని విద్యార్థి సంఘాలంటున్నాయి. ఫీజులను స్వీకరిస్తున్న కాలేజీలు కనీసం రసీదులు కూడా ఇవ్వడం లేదు.
18వేల కోట్లు చెల్లించిన బీఆర్ఎస్
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కొండలను తలపిస్తున్నాయి. 2014కు ముందు కాంగ్రెస్ సర్కార్ నుంచి రూ.1,880కోట్ల బకాయిలు వారసత్వంగా వచ్చాయి. ఆ తర్వాత ఏర్పడ్డ బీఆర్ఎస్ సర్కార్ వాటిని చెల్లించింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్లా బకాయిలను చెల్లించమని చెప్పలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని యథాతథంగా కొనసాగించింది. పదేండ్లలో ఈ స్కీమ్ కింద రూ.18,500 కోట్లు చెల్లించింది. ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. రాష్ట్రంలో ఐదేండ్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుంటే, దీంట్లో మూడేండ్లు కాంగ్రెస్ సర్కార్‌కు చెందినవే. మొత్తం బకాయిలు రూ.11,500కోట్లకు చేరినట్టు కాలేజీ యాజమాన్యాలంటున్నాయి. కాంగ్రెస్ వచ్చాక ఈ రెండున్నరేండ్లలో రూ.829.12కోట్లు మాత్రమే విడుదల చేసింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేసే కుట్ర
రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా సర్కార్ చెలగాటమాడుతున్నది. ఈ పథకంపై ఆధారపడి లక్షలాది మంది చదువుకుంటున్నారు. ఫీజులు కట్టలేక ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవాలనడం సరికాదు. ఫీజు బకాయిల తీర్పుపై హైకోర్టు పునరాలోచించాలి. బకాయిల విడుదలపై ప్రభుత్వానికి కోర్టు డెడ్‌లైన్ పెట్టాలి. సీఎంగా విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్రచేస్తున్నారు. పంతం వీడి మొత్తం బకాయిలు విడుదల చేయాలి.
– కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
నిర్వీర్యం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటాం
రీయింబర్స్మెంట్ పథకం కోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వాటా నిధులు చెల్లించడం లేదు. దీంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు వెనక్కి వెళ్తున్నాయి. బకాయిలు విడుదల చేయాలని కాలేజీలు, విద్యార్థి సంఘాలు ఉద్యమించే పరిస్థితి రావడం దురదృష్టకరం. ఈ పథకం అవసరం లేదన్నట్టుగా విద్యాకమిషన్ సిఫారసు చేయడం గర్హనీయం. సీఎం మౌనం వీడి స్పష్టమైన ప్రకటన చేయాలి. ఈ పథకాన్ని ఎత్తివేసే, నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కుట్రలను విద్యార్థి ఉద్యమాలతో అడ్డుకుంటాం. – మాచర్ల రాంబాబు, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి