Congress Govt | హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ దిశగా మరో నిర్ణయం తీసుకున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన గురుకుల సొసైటీ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల నిర్వీర్యానికి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ సర్కారు పైకొకటి చెబుతూ తెరవెనక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీవోఈల్లోని సబ్జెక్టు అసోసియేట్లను తొలగించేందుకు ప్రయత్నించింది. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు సీవోఈల్లో ప్రవేశాల పద్ధతిని మార్చేందుకు సిద్ధమైంది. రాత పరీక్ష లేకుండా నేరుగా అడ్మిషన్ కల్పించనున్నామని ఇటీవల సొసైటీ సెక్రటరీ వర్షిణి వెల్లడించారు. అలా జరిగితే సీవోఈల లక్ష్యమే పూర్తిగా దెబ్బతింటుందని విద్యావేత్తలు, విద్యార్థిసంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇప్పటివరకు రెండు దశల్లో పరీక్ష
ఐఐటీ, మెడిసిన్ వంటి ఉన్నత విద్యాభ్యాసం పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షగా మారింది. లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కానీ పేద బిడ్డలు ఆశయాలు సాధించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 38 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు చేసింది. మొత్తం 38 సెంటర్లలో 3680 సీట్లు అందుబాటులో ఉంచింది. ఏటా రెండు దశల్లో రాత పరీక్షను నిర్వహించి ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించింది. ఎంపికైన విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడిసిన్, ఉన్నత సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకున్నది. కేసీఆర్ దార్శనికత సత్ఫలితాలు ఇచ్చింది. సీవోఈల్లో చదువుకున్న వేలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడికల్ సీట్లు సాధించారు. రాష్ట్రంలోని గురుకుల విద్యావ్యవస్థకు సీఈవోలు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచాయి.
కొత్త పద్ధతి కోసం సర్కారు చర్యలు
సీవోఈల్లో ప్రవేశానికి సంబంధించి ఇప్పటివరకు అనుసరించిన విధానాలకు స్వస్తి పలికేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి కేవలం ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలలు చదివిన విద్యార్థులకు నేరుగా గురుకుల ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలను కల్పించనుంది. సీవోఈల్లో కూడా రాతపరీక్షకు స్వస్తి పలుకుతున్నామని, నేరుగా సొసైటీకి చెందిన గురుకులాల్లో చదివిన 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులనే చేర్చుకోనుంది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన సమావేశంలో సొసైటీ సెక్రటరీ వర్షిణి స్వయంగా వెల్లడించారు.