హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ‘సర్’ భాగంగా జారీచేసే ప్రతి నోటీసును సంబంధిత ఓటరుకు బూత్ లెవల్ అధికారి (బీఎల్వో) వ్యక్తిగతంగా అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. నోటీసు అందజేసినట్టు తప్పనిసరిగా రాతపూర్వక లేదా నిర్దేశిత పద్ధతిలో రసీదు తీసుకోవాలని సూచించారు. నోటీసు జారీ చేసిన తర్వాత నిర్దేశించిన ఏడు రోజుల వ్యవధిని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
ఓటరుకు విచారణకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విచారణకు కనీసం రెండు రోజుల ముందే బీఎల్వోలు ఓటర్లకు మరోసారి సమాచారం అందించాలని సూచించారు. ‘సర్’ ప్రక్రియపై హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి అదనపు సీఈవో వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో జీఎస్ చారితో కలిసి సీఈవో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
‘సర్’లో ఓటర్లు సమర్పించాల్సిన పత్రాల విషయంలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సీఈవో సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఏఈఆర్వోలు, అదనపు ఏఈఆర్వోలతో సంప్రదించి విచారణల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేయాలని, నోటీసుల అందజేత నుంచి విచారణ నిర్వహణ వరకు ప్రతి దశపై అధికారుల పర్యవేక్షణ ఉండేలా చూడాలని చెప్పారు. నో మ్యాపింగ్, అనామలిస్ కేసులకు సంబంధించిన జాబితాలను రాజకీయ పార్టీలకు అందించాలని ఆదేశించారు.
‘సర్’ ప్రక్రియలో నిర్దేశించిన విధానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదని సీఈవో సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి కార్యకలాపాన్ని పద్ధతి ప్రకారం నిర్వహించి, దానికి సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల్లో ‘సర్’ పురోగతిని సీఈవో సమీక్షించారు. నోటీసుల పంపిణీ, విచారణల షెడ్యూల్ తయారీ, కేసుల విభజన, ఏఈఆర్వోలు, అదనపు ఏఈఆర్వోలకు కేసుల కేటాయింపు వంటి అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రక్రియలను వేగవంతం చేయడంతోపాటు, ప్రతి దశను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
‘సర్’ ప్రక్రియ కారణంగా రాష్ట్రంలో అర్హత ఉన్న ఏ ఒక ఓటరు పేరు తొలగిపోకూడదని, అలాగే అనర్హులైన ఓటరు ఎవరూ జాబితాలో చేరకూడదని సీఎం రేవంత్‌రెడ్డి ఈసీఐని కోరారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌కు శనివారం లేఖ రాశారు. గణన సిబ్బంది పరిశీలనకు వచ్చిన సమయంలో తాతాలికంగా ఇండ్లలో లేనివారిని, శాశ్వతంగా నివాసం మారినవారిని ఒకే విధంగా పరిగణిస్తున్నారని తెలిపారు. సుమారు 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రాష్ట్రంలోని దాదాపు మూడోవంతు ఓటర్లను ప్రభావితం చేసే అంశమని ఎన్నికల సంఘానికి వివరించారు. సెప్టెంబర్ 16 వరకు ఉన్న అభ్యంతరాలు, ఫిర్యాదుల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని కోరారు.