హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్రం మరోసారి తప్పుడు ప్రచారానికి దిగింది. రాష్ట్రంలో కొత్తగా కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని బుకాయించింది. గతంలో ఎస్టీ రిజర్వేషన్లపై కూడా ఇదేవిధంగా తప్పుడు సమాచారం ఇవ్వడం గమనార్హం. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టానికి అదనంగా కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయాలని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులను కోరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎంపీలు సైతం కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
అధికారులు ప్రతిపాదనలు పంపించారు. కానీ, ఈ అంశంపై రాజ్యసభలో బీఆర్ఎస్ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి బుధవారం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలోనే రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని పేర్కొనడం గమనార్హం. తెలంగాణలో ఇప్పటివరకు 35 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయని తెలిపారు. కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభించడం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.
ఆ సమాచారం మా వద్ద లేదు: కేంద్ర మంత్రి సుభాష్ సర్కార్
అంతర్జాతీయ సంబంధాలపై పరిశోధన చేసేవారికి కేంద్రం ఏమైనా సహాయం చేస్తున్నదా? అని ఎంపీ దీవకొండ దామోదర్‌రావు అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి సుభాష్ సర్కార్ కచ్చితమైన సమాచారం అందించలేకపోయారు. అంతర్జాతీయ సంబంధాలపై పరిశోధన చేసే వారి వివరాలు తమ వద్ద లేవని కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. పీహెచ్డీ చేసే వారికి యూనివర్సిటీల ద్వారా యూజీసీ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఇస్తున్నదని తెలిపారు.